Site icon NTV Telugu

Sania Mirza: టెన్నిస్‌ రాకెట్‌ పట్టని వారు కూడా మాట్లాడేవారు.. ఒక్కోసారి జాలి కలిగేది!

Sania Mirza

Sania Mirza

బెంగళూరు టెక్‌ సమ్మిట్‌ 2025లో ఆరుసార్లు గ్రాండ్‌ స్లామ్‌ ఛాంపియన్‌ సానియా మీర్జా అప్పటి రోజులను గుర్తుచేసుకుంటూ.. భారత మహిళల క్రికెట్‌ జట్టు సభ్యురాలు రిచా ఘోష్‌కు సలహాలు ఇచ్చారు. సోషల్‌ మీడియాను అస్సలు పట్టించుకోవద్దని సూచించారు. సోషల్‌ మీడియా ప్రభావం మన మీద ఉండకుండా చూసుకోవాలని, పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకూడదని చెప్పారు. మొదట్లో మహిళల క్రికెట్‌కు అంత ఆదరణ ఉండేది కాదని, అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఉండేవారు కాదని.. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారాయన్నారు. టెన్నిస్‌ రాకెట్‌ పట్టని వారు కూడా విమర్శలు చేశేవారని.. ఒక్కోసారి జాలి కలిగేదని సానియా చెప్పుకొచ్చారు.

‘రిచా ఘోష్‌ యువ క్రీడాకారిణి. ఈ తరంలో ఎలక్ట్రానిక్‌ మీడియా, సోషల్‌ మీడియాను ఆమె చూస్తోంది. మా రోజుల్లో వార్త పత్రికలే ఉండేవి. వాటి పైనే మేము ఆధారపడేవాళ్లం. ఎలక్ట్రానిక్‌ మీడియా అప్పటినుంచి వ్యక్తిగత జీవితాల మీద ఫోకస్‌ ఎక్కువగా పెరిగింది. ముందురోజు డిన్నర్‌కు వెళ్లడం వల్లే మ్యాచ్‌ ఓడిపోయింది అంటూ లేనిపోని కథనాలు అల్లేవారు. ఇలాంటి వాటిని నేను పెద్దగా పట్టించుకోను. నాకు ఇవన్నీ హాస్యాస్పదంగా అనిపించేవి. ఒక్కసారి టెన్నిస్‌ రాకెట్‌ చేత్తో తాకని వారు కూడా క్రీడాకారుల గురించి మాట్లాడడం నాకు నవ్వు తెప్పించేది. నాకు వాళ్లను చూస్తే జాలి కలిగేది. జీవితంలో ఆనందంగా లేనివారే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిపై బురద చల్లే ప్రయత్నం చేస్తారు. మంచైనా, చెడైనా మన మనసులోకి తీసుకోవద్దు. సోషల్‌ మీడియా ప్రభావం మన మీద ఉండకుండా చూసుకోవాలి’ అని సానియా మీర్జా అన్నారు.

 

Exit mobile version