Sana Mir: వంటగదిలో రోటీలు చేసుకోండని పురుష క్రికెటర్లను అంటారా?.. ఈ లింగ వివక్ష ఎందుకు!

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో పాకిస్థాన్ నిరాశాజనక ప్రదర్శన
  • పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టుపై విమర్శలు
  • రోటీలు చేయాలని ఎవరైనా అంటారా?
  • అమ్మాయిలు ఎన్నో అడ్డంకులు దాటాలి
Sana Mir Pak

Sana Mir Pak

Sana Mir Slams Sexist Criticism of Pakistan Women’s Cricket Team: పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టుపై వస్తున్న విమర్శల తీరును పాక్ మాజీ కెప్టెన్ సనా మీర్ తీవ్రంగా తప్పుబట్టారు. మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026లో పాకిస్థాన్ జట్టు నిరాశాజనక ప్రదర్శన చేసినప్పటికీ.. విమర్శలు కేవలం ఆటపైనే ఉండాలని, లింగ వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని స్పష్టం చేశారు. పురుషుల జట్టు ఓడితే ఎవరైనా వంటగదికి వెళ్లి రొట్టెలు చేయాలని అంటారా? అని ఆమె ప్రశ్నించారు. మహిళలు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలంటే ఎన్నో సామాజిక, కుటుంబపరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని సనా మీర్ గుర్తుచేశారు.

రోటీలు చేయాలని ఎవరైనా అంటారా?:

టీ20 ప్రపంచకప్‌ 2026లో పాకిస్థాన్ మహిళల జట్టు దారుణ ప్రదర్శన చేసింది. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ల చేతిలో వరుస పరాజయాలు చవిచూసింది. చివరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై గెలిచి.. మెగా టోర్నీని ముగించింది. అయితే జట్టు ప్రదర్శనపై సోషల్ మీడియాలో, పలు వేదికల్లో వచ్చిన విమర్శలు సనా మీర్‌ను తీవ్రంగా కలచివేశాయి. ఒక పాకిస్థానీ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘పురుషుల జట్టు ఓడితే ఎవరైనా వాళ్లను వంటగదికి వెళ్లి రోటీలు చేయాలని అంటారా?. ఎవరూ అలా అన్నారు. కానీ మహిళల జట్టు ఓడితే అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు?. ఇది స్పష్టమైన ద్వంద్వ వైఖరి. జట్టు ఆశించిన స్థాయిలో ఆడలేదనే విమర్శలు చేయొచ్చు. కానీ మహిళలు కావడం వల్ల లింగ వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేయడం సరికాదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమ్మాయిలు ఎన్నో అడ్డంకులు దాటాలి:

ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌ 2026కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సనా మీర్.. జట్టు ప్రదర్శనపై అందరికీ నిరాశ ఉందని, కానీ విమర్శించే విధానమే తనను ఎక్కువగా బాధిస్తోందని అన్నారు. ‘ఇన్ని సంవత్సరాలు గడిచినా మహిళల క్రికెట్‌కు ఇప్పటికీ తగిన గౌరవం లభించడం లేదు. వారి ఆటను క్రికెట్ పరంగా కాకుండా మహిళలు అనే కోణంలోనే ఎక్కువగా చుస్తున్నారు. పాకిస్థాన్‌లో మహిళలు ప్రొఫెషనల్ క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలంటే ఎన్నో సామాజిక, కుటుంబపరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అమ్మాయిలు ఎన్నో అడ్డంకులు దాటాలి. వారు సంచలన విజయాలు సాధించే సామర్థ్యం ఉందని నిరూపించడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ముందుగా మహిళల క్రికెట్‌పై సమాజంలో ఉన్న ఆలోచనా విధానం మారాలి. అప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది’ అని అన్నారు.

పెద్దగా పోటీ లేకపోవడం కూడా:

సోషల్ మీడియాలో కొందరు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో మహిళా క్రికెటర్లను ఎగతాళి చేసే వీడియోలు రూపొందించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని కూడా పాక్ మాజీ కెప్టెన్ సనా మీర్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి చర్యలు ఆటగాళ్లతో పాటు వారి కుటుంబాలను కూడా తీవ్రంగా బాధిస్తున్నాయని చెప్పారు. దేశంలో మహిళల క్రికెట్ అభివృద్ధి చెందాలంటే ప్రతిభావంతులైన ఆటగాళ్ల సంఖ్యను పెంచడం, దేశవాళీ టోర్నీలను మరింత విస్తృతంగా నిర్వహించడం అవసరమని సూచించారు. ప్రస్తుతం జట్టులో స్థానాల కోసం పెద్దగా పోటీ లేకపోవడం కూడా ఆటగాళ్ల ఆలోచనా విధానంపై ప్రభావం చూపుతోందని సనా మీర్ అభిప్రాయపడ్డారు.