Joe Root Nears Sachin’s Test Record: టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డుకు ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ చేరువవుతున్నాడు. ఈ నేపథ్యంలో రూట్‌పై సచిన్ ప్రశంసలు కురిపించాడు. తన అరంగేట్రం టెస్టు మ్యాచ్‌లోనే అతడిలో గొప్ప ఆటగాడయ్యే లక్షణాలను గుర్తించానని పేర్కొన్నారు. మంగళవారం రెడిట్‌లో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సచిన్ సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డును రూట్ అధిగమించే అవకాశంపై ఓ అభిమాని ప్రశ్నించాడు. దీనికి సచిన్ స్పందిస్తూ.. ‘నేను ఎప్పుడూ రూట్‌ను చాలా గొప్పగా భావించేవాడిని. అతడి తొలి టెస్టు మ్యాచ్‌లోనే అతడు గొప్ప స్థాయికి ఎదుగుతాడని నాకు అనిపించింది’ అని తెలిపాడు.
ప్రస్తుతం టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో జో రూట్ రెండో స్థానంలో ఉన్నాడు. 169 టెస్టు మ్యాచ్‌ల్లో 309 ఇన్నింగ్స్‌లు ఆడిన అతడు.. 14,278 పరుగులు సాధించాడు. సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డును అధిగమించాలంటే రూట్ ఇంకా 1,643 పరుగులు చేయాల్సి ఉంది. సచిన్ తన టెస్టు కెరీర్లో 200 మ్యాచ్‌లు ఆడి 329 ఇన్నింగ్స్‌ల్లో 15,921 పరుగులు చేశాడు. ఇప్పటికీ ఇదే టెస్టు క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డుగా కొనసాగుతోంది. రూట్ 2012 డిసెంబర్లో నాగ్‌పూర్ వేదికగా భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో సచిన్ కూడా భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 229 బంతులు ఎదుర్కొని 73 పరుగులు చేసిన రూట్.. రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అప్పుడే రూట్ ప్రతిభను గుర్తించినట్లు సచిన్ తాజాగా వెల్లడించారు.
భారత ఆటగాళ్లు కాకుండా తనకు ఇష్టమైన బ్యాటర్ల గురించి అడిగిన మరో ప్రశ్నకు సచిన్ ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. ఇంగ్లండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్, జో రూట్‌తో పాటు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ పేర్లను చెప్పారు. వన్డే క్రికెట్ ఫార్మాట్లో మార్పులపైనా సచిన్ తన అభిప్రాయాన్ని మరోసారి వెల్లడించారు. 50 ఓవర్ల మ్యాచ్‌ను ఒక్కో జట్టుకు రెండు విడతలుగా 25 ఓవర్ల చొప్పున విభజించాలని సూచించారు. అయితే మొత్తం 50 ఓవర్లకు కలిపి 10 వికెట్లు మాత్రమే ఉండాలని, మ్యాచ్ అంతటా ఒకే బంతిని ఉపయోగించాలని అభిప్రాయపడ్డారు.
‘నా సూచన చాలా సులభం. 50 ఓవర్లను రెండు ఇన్నింగ్స్‌లుగా విభజించి, ఒక్కో ఇన్నింగ్స్‌ను 25 ఓవర్లుగా నిర్వహించాలి. అయితే మొత్తం 50 ఓవర్లకు కలిపి 10 వికెట్లు మాత్రమే ఉండాలి. మ్యాచ్ అంతటా ఒకే బంతిని ఉపయోగించాలి. దీనివల్ల బ్యాట్, బంతి మధ్య పోటీ కొనసాగుతుంది. మంచు ప్రభావం ఉండే పరిస్థితుల్లోనూ రెండు జట్లకు బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం లభిస్తుంది. దీంతో ఇరు జట్లకు సమతుల్యత ఉంటుంది. బౌలర్లు కనుమరుగయ్యే పరిస్థితి రాకముందే ఏదో ఒక మార్పు చేయాలి’ అని క్రికెట్ దిగ్గజం సచిన్ పేర్కొన్నారు.

