సఫారీ గడ్డపై సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ ను గెలిచి చరిత్ర సృష్టించాలనుకున్న భారత్‌కు రెండో టెస్టులో ఎదురుదెబ్బ తగిలింది. మొదటి టెస్టులో విజయం సాధించిన భారత్ రెండో టెస్టులో అదే దూకుడును ప్రదర్శించాలని చూసింది. రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే సౌతాఫ్రికా జట్టు కూడా మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 229 పరుగులు మాత్రమే చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా 266 పరుగులకే అలౌట్ అయింది. 243 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన సౌతాఫ్రికాకు ఆది నుంచే కష్టాలు ఎదురయ్యాయి. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది.
Read: ముంబైలో భారీగా పెరిగిన కేసులు…
నాలుగో రోజు ఆట ప్రారంభమైనప్పటి నుంచి వర్షం కురవడంతో లంచ్ విరామం వరకు మ్యాచ్ ఆగిపోయింది. నాలుగో రోజు కూడా ఆట రద్దవుతుందేమో అనుకున్నారు. కానీ వరుణుడు శాంతించడంతో ఆట మొదలైంది. ఆట మొదలైన వెంటనే సౌతాఫ్రికా జట్టు డెస్సన్ వికెట్‌ను కోల్పోయింది. అయితే క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ డీన్ ఎల్గర్ వీరోచిత పోరాటం చేశాడు. ఎల్గర్‌కు బవుమా సహకరించడంతో భారత్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది సౌతాఫ్రికా. కెప్టెన్ డీన్ ఎల్గర్ 93 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.