అంతర్జాతీయ క్రికెట్‌లో మరో స్టార్ క్రికెటర్ శకం ముగిసింది. న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ రాస్ టేలర్ తన కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడేశాడు. హామిల్టన్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో రాస్ టేలర్ 16 బంతుల్లో ఒక ఫోర్ సాధించి 14 పరుగులు చేసి అవుటయ్యాడు. టేలర్‌కు ఇది చివరి వన్డే కావడంతో అతడు అవుట్ కాగానే స్టేడియంలోని ప్రేక్షకులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. న్యూజిలాండ్ క్రికెటర్లే కాకుండా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు కూడా రాస్ టేలర్‌కు వీడ్కోలు పలికారు.
అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు రాస్ టేలర్ భావోద్వేగానికి గురయ్యాడు. జాతీయ గీతం ఆలపించే సమయంలో కన్నీటి పర్యంతమయ్యాడు. జాతీయ గీతం ముగిసేదాకా కళ్లను తుడుచుకుంటూనే టేలర్ కనిపించాడు. అంతేకాకుండా క్రీజులోకి దిగే ముందు, పెవిలియన్ దారి పట్టినప్పుడు కూడా రాస్ టేలర్ చాలా ఎమోషనల్‌గా కనిపించాడు. కాగా రాస్ టేలర్ అంతర్జాతీయ వన్డేల్లో 235 మ్యాచ్‌లు ఆడి 8,588 పరుగులు సాధించాడు. వీటిలో 51 హాఫ్ సెంచరీలు, 21 సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ కెరీర్ పరంగా చూసుకుంటే 451 మ్యాచ్‌లు ఆడిన రాస్ టేలర్ మొత్తం 18,213 పరుగులు చేశాడు. 40 సెంచరీలు, 93 హాఫ్ సెంచరీలను నమోదు చేశాడు. వీటిలో 1,766 ఫోర్లు, 273 సిక్సర్లు ఉన్నాయి.
