Site icon NTV Telugu

Rohit Sharma: ఒకే దెబ్బకు మూడు పిట్టలు.. సచిన్ రికార్డ్ బద్దలు

Rohit Sharma Records

Rohit Sharma Records

Rohit Sharma Breaks Sachin Tendulkar Record: నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఒంటరి పోరాటం చేశాడు. ఓవైపు ఓపెనర్లు సహా మిడిలార్డర్ బ్యాట్స్మన్లు నిరాశాజనకమైన ప్రదర్శన కనబరిస్తే, మరోవైపు రోహిత్ మాత్రం దుమ్ము దులిపేశాడు. సూర్య కుమార్‌తో కలిసి టీమిండియా ఇన్నింగ్స్‌ని ముందుకు నడిపించాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే దూకుడు ప్రదర్శించిన రోహిత్.. తొలుత 32 బంతుల్లోనే అర్థశతకం సాధించాడు. ఓవరాల్‌గా 41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో 72 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే రోహిత్ తన ఖాతాలో మూడు రికార్డులు వేసుకున్నాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కి సంబంధించిన ఓ రికార్డ్‌ని సైతం బద్దలు కొట్టాడు.

శ్రీలంకపై 72 పరుగులు చేయడంతో.. రోహిత్ శర్మ ఆసియా కప్‌లో 1000 పరుగుల మార్క్‌ని దాటేశాడు. దీంతో, ఈ టోర్నీలో భారత జట్టు తరఫున అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మన్‌గా రోహిత్ అవతరించాడు. ఇప్పటివరకూ 971 పరుగులు సచిన్ అగ్రస్థానంలో ఉండగా.. తాజాగా 1016 పరుగులతో ఆయన రికార్డ్‌ని బ్రేక్ చేసి, అగ్రస్థానంలో నిలిచాడు హిట్ మ్యాన్. ఓవరాల్‌గా ఆసియా కప్‌లో చూసుకుంటే.. రోహిత్ మూడో స్థానంలో ఉన్నాడు. తొలి రెండు స్థానాల్లో సనత్ జయసూర్య (1220), కుమార సంగక్కర (1075) ఉన్నారు. ఇక ఇదే మ్యాచ్‌లో నాలుగు సిక్సర్లు కొట్టడంతో.. ఇప్పటివరకూ ఆసియా కప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మన్‌గా రోహిత్ నిలిచాడు. షాహిద్ ఆఫ్రిది 40 సిక్సర్లు కొట్టగా, అదే సంఖ్యతో అతనితో కలిసి రోహిత్ సంయుక్తంగా తొలిస్థానంలో ఉన్నాడు.

కాగా.. ఆసియా కప్‌లో భాగంగా లీగ్ దశలో అదరగొట్టిన భారత్, సూపర్ 4లో మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. పాకిస్తాన్, శ్రీలంకతో ఆడిన రెండు మ్యాచుల్లోనూ పరాజయం చవిచూసింది. రెండింటిలోనూ చివరివరకూ పోరాడి ఓడిపోయింది. బౌలర్లు విఫలం కావడంతో, చేజేతులా మ్యాచుల్ని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో, ఫైనల్‌కు చేరకుండానే భారత్ ఇంటి బాట పట్టాల్సి వచ్చింది. ముఖ్యంగా.. నిన్న జరిగిన మ్యాచ్‌లో రోహిత్ మినహాయిస్తే, ఇతర బ్యాట్స్మన్లు, బౌలర్లు ఏమంత ఆశాజనకమైన ప్రతిభ కనబర్చలేకపోయారు. ఫలితంగా, మ్యాచ్ చేజార్చుకోవాల్సి వచ్చింది.

Exit mobile version