NTV Telugu Site icon

INDvsNZ ODI: రోహిత్, గిల్ సెంచరీల మోత..న్యూజిలాండ్ టార్గెట్ 386

Team1

Team1

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ (101), శుభ్‌మన్ గిల్ (112) సెంచరీల మోత మోగించారు. ప్రత్యర్థి బౌలర్ల పనిపడుతూ పరుగుల వరద పారించారు. దీంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రోహిత్‌సేన నిర్ణీత 50 ఓవర్లలో 385/9 భారీ స్కోర్ చేసింది. ఇన్నింగ్స్‌ను రోహిత్ మొదట నెమ్మదిగా మొదలుపెట్టగా.. గిల్ మాత్రం తన ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఫెర్గుసన్ వేసిన రెండో ఓవర్లో ఫోర్‌తో బౌండరీల ఖాతా తెరిచిన గిల్.. అదే జోరు కొనసాగించాడు. ఇక ఫెర్గుసన్ వేసిన 8వ ఓవర్లో అయితే ఏకంగా నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 రన్స్ పిండుకున్నాడు. 10వ ఓవర్లో రెండు సిక్సర్లతో రోహిత్ కూడా టచ్‌లోకి వచ్చాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 33 బంతుల్లో గిల్ అర్ధశతకం చేయగా.. రోహిత్ 41 బాల్స్‌లో 50 రన్స్ కంప్లీట్ చేసుకున్నాడు. అనంతరం మరింత జోరు పెంచిన వీరిద్దరూ తమదైన శైలి బ్యాటింగ్‌తో రెచ్చిపోయారు. ఆసాంతం క్లాస్ ఇన్నింగ్స్‌ ఆడిన రోహిత్ మూడేళ్ల తర్వాత వన్డేల్లో సెంచరీ పూర్తి చేశాడు. కెరీర్‌లో రోహిత్‌కు ఇది 30వ వన్డే సెంచరీ. అనంతరం యంగ్ ఓపెనర్ గిల్‌ కూడా తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 72 బాల్స్‌లో శతకం బాదాడు. కాసేపటికే వీరిద్దరూ ఔటయ్యారు. దీంతో మొదటి వికెట్‌కు 212 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది.

మిడిల్ ఢమాల్

రోహిత్, గిల్ అందించిన అద్భుత శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోని మిడిలార్డర్ బ్యాటర్లు వెంటవెంటనే వికెట్లు సమర్పించుకున్నారు. మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ నిరాశపర్చిన విరాట్ కోహ్లీ (36) ఈ మ్యాచ్‌లోనూ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఇక మిడిల్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ (17), సూర్యకుమార్ (14), సుందర్ (9) పూర్తిగా విఫలమయ్యారు. దీంతో 313 రన్స్‌కు టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయింది. దీంతో టీమ్ స్కోర్ 400 ఈజీగా దాటుతుందనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. చివర్లో హార్దిక్‌ (54) హాఫ్ సెంచరీతో రాణించడంతో భారత జట్టు 385/9 స్కోర్ చేయగలిగింది. న్యూజిలాండ్ బౌలర్లలో డఫ్పీ, శాంట్నర్ చెరో మూడు వికెట్లతో రాణించగా బ్రేస్‌వెల్ ఒక వికెట్ తీశాడు.