Site icon NTV Telugu

Ricky Ponting: ఇషాన్ కిషన్ వద్దు.. పంత్ బెటర్

Ricky Ponting On Pant

Ricky Ponting On Pant

Ricky Ponting Chose Rishabh Pant Over Ishan Kishan For T20 World Cup: టీ20 వరల్డ్‌కప్-2022 టోర్నీకి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో.. భారత జట్టులో ఏయే ఆటగాళ్లకి చోటిస్తే బాగుంటుందన్న విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఈసారి చాలామంది ఆటగాళ్లు లైనప్‌లో ఉండటంతో, ఎవరికి చోటు దక్కుతుందా? అన్నది ఆసక్తిగా మారింది. అయితే.. కొందరు మాజీలు మాత్రం రిషభ్ పంత్‌ని తీసుకోవద్దని సూచిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన పంత్, ఆ సిరీస్‌లో బ్యాట్స్మన్‌గా పెద్దగా రాణించకపోవడంతో.. వరల్డ్‌కప్ జట్టుకి అతడ్ని ఎంపిక చేయొద్దని మాజీలు చెప్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్‌కప్ టోర్నీలో దినేశ్‌ కార్తిక్‌, హార్దిక్‌ పాండ్యాలు ఫినిషర్లుగా కీలక పాత్ర పోషించగలరని.. వీరికి యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ తోడైతే, టీమిండియాను ఎదుర్కోవడం ప్రత్యర్థి జట్లకు తేలికేమీ కాదని అభిప్రాయపడ్డాడు. ‘‘వన్డే ఫార్మాట్‌లో తానెలా ఆడగలనో రిషభ్ పంత్ మరోసారి తనని తాను నిరూపించుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లోనూ అతడు అదే విధంగా సత్తా చాటగలడు. అతనితో పాటు ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన దినేశ్ కార్తీక్‌కి నా వరల్డ్‌కప్ జట్టులో తప్పక చోటు ఉంటుంది. రిషభ్ మూడు, నాలుగు లేదా ఐదో స్థానంలో వచ్చినా.. దినేశ్‌, హార్దిక్‌ ఫినిషర్లుగా రాణించగలరు. వీళ్లు ముగ్గురూ చెలరేగితే టీమిండియాకు తిరుగు ఉండదు’’ అని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు.

అయితే.. ఇషాన్ కిషన్‌కి మాత్రం జట్టులో స్థానం దొరకడం కష్టమని రికీ పాంటింగ్ వెల్లడించాడు. శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ మధ్య మాత్రం పోటీ తీవ్రంగా ఉంటుందని.. ప్రస్తుతం వీరిద్దరిలో సూర్యకుమార్ మంచి ఫామ్‌తో ముందంజలో ఉన్నాడని చెప్పాడు. వీరితో పాటు ప్రతిభావంతులైన ఆటగాళ్లు జట్టులో చాలామంది ఉన్నారని, ఇలాంటప్పుడు ఎవరిని సెలెక్ట్ చేయాలన్నది సెలెక్టర్లకు తలనొప్పిగా మారడం ఖాయమని పేర్కొన్నాడు. తానైతే.. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్లలో ఇషాన్‌కి బదులు పంత్‌కే ఓటు వేస్తానని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

Exit mobile version