ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 14 సీజన్‌లు పూర్తయ్యాయి. అయినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయింది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లు టైటిల్ విజేతలుగా నిలిచినా బెంగళూరు జట్టుకు మాత్రం ఇంకా ఆ భాగ్యం దక్కలేదు. దీంతో ఈ సారైనా తమ జట్టు టైటిల్ గెలుస్తుందని ఆశిస్తున్న ఆర్‌సీబీ అభిమానులకు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాష్ చోప్రా తన మాటలతో షాకిచ్చాడు.
ఈ ఏడాది కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ గెలవలేదని.. ఆ జట్టుకు అంత సీన్ లేదని ఆకాష్ చోప్రా తేల్చి చెప్పేశాడు. ఆ జట్టు కనీసం ప్లే ఆఫ్స్‌కు చేరదని అంచనా వేశాడు. బెంగళూరు జట్టులోని మ్యాక్స్‌వెల్ మంచి ప్లేయర్ అయినా అతడిపై నమ్మకం ఉంచలేమన్నాడు. అతడు ఓ రిస్క్ ప్లేయర్ అని.. నిలకడగా ఆడతాడని కచ్చితంగా చెప్పలేమన్నాడు. డుప్లెసిస్, కోహ్లీ, మ్యాక్స్‌వెల్ మినహా ఆర్సీబీ జట్టులో మ్యాచ్ విన్నర్లు లేకపోవడం మైనస్ పాయింట్ అని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. బౌలింగ్‌లో రాహుల్ చాహర్, చాహల్ వంటి ఆటగాళ్లను తీసుకోకుండా హసరంగాను ఎక్కువ ఖర్చు పెట్టి కొనుగోలు చేయడం తనను ఆశ్చర్యపరిచిందన్నాడు. కాగా 15వ సీజన్ ఐపీఎల్‌లో ఆర్సీబీకి డుప్లెసిస్ సారథిగా వ్యవహరించనున్నాడు. కెప్టెన్ మారడంతో తమ జట్టు రాత కూడా మారుతుందని ఆర్సీబీ యాజమాన్యం ఆశిస్తోంది.
