Site icon NTV Telugu

CSK: చెన్నైకి పెద్ద షాక్.. జడేజా ఔట్!

Jadeja Ruled Out

Jadeja Ruled Out

అసలే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన అంతంత మాత్రమే ఉంది. ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు నీరుగారిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జట్టుకి మరో పెద్ద షాక్ తగిలింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. పక్కటెముక గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. ఈ విషయాన్ని చెన్నై జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ ధృవీకరించారు.

ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో జడేజా ఛాతిపై గాయాలయ్యాయి. అందుకే, అతడు ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఆడలేదు. తదుపరి మ్యాచ్‌లో ఆ గాయం తీవ్రత తగ్గుతుందని భావిస్తే, అందుకు భిన్నంగా అది రెట్టింపు అయ్యింది. దీంతో.. లీగ్ దశలో చెన్నై ఆడబోయే తదుపరి మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండటం లేదు. వైద్యుల సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెన్నై జట్టు యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

ఇదిలావుండగా.. చెన్నై జట్టులోని కీలకమైన ఆటగాళ్ళలో ఒకడైన జడేజా, ఈ సీజన్‌లో మాత్రం పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు. మొత్తం పది మ్యాచుల్లో కేవలం 116 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లోనూ ఐదు వికెట్లే తీశాడు. సీజన్ ప్రారంభంలో కెప్టెన్ పగ్గాలు ఇవ్వడంతో.. ఆ బాధ్యత మోయలేకపోవడం వల్లే సమర్థంగా జట్టుని నడిపించలేకపోయాడు, తానూ రాణించలేకపోయాడు. దీంతో, కెప్టెన్ బాధ్యతల్ని తిరిగి ధోనీ అందుకున్నాడు.

Exit mobile version