Ravi Shastri Commentary: 1994లో మొదలైన ప్రయాణం.. కామెంటరీలో తన గురువులెవరో వెల్లడించిన రవిశాస్త్రి!

Ravi Shastri Commentary Career

Ravi Shastri Commentary Career

Ravi Shastri Commentary Career: టీమిండియా మాజీ క్రికెటర్, కోచ్ రవిశాస్త్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెటర్‌గా అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రవిశాస్త్రి.. ఆ తర్వాత భారత జట్టు కోచ్‌గా కూడా వావ్ అనిపించుకున్నారు. ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్‌గా, టీవీ ప్రజెంటర్‌గా తనదైన ముద్ర వేస్తున్నారు. ఆటపై ఉన్న ఇష్టమే తనను ఇన్నేళ్లుగా క్రికెట్‌తో అనుబంధంగా ఉంచిందని రవిశాస్త్రి చెప్పారు. తాజాగా స్కై స్పోర్ట్స్‌కు చెందిన ఇయాన్ స్మిత్‌తో జరిగిన సంభాషణలో తన కామెంటరీ ప్రయాణం, ఆరంభ రోజులు, తన కెరీర్‌ను ప్రభావితం చేసిన దిగ్గజాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘కామెంటేటర్‌గా ఇన్నేళ్ల పాటు కొనసాగాలంటే ఆటపై నిజమైన ప్రేమ, ఆసక్తి ఉండాలి. క్రికెట్‌ను కేవలం ఉద్యోగంగా భావిస్తే ఎక్కువ కాలం ఈ రంగంలో కొనసాగడం సాధ్యం కాదు. ప్రతి మ్యాచ్‌ను అదే ఉత్సాహంతో ఆస్వాదించాలంటే ఆటపై అభిరుచి ఉండటం తప్పనిసరి. నా కెరీర్‌లో ఎన్నో కీలక మ్యాచ్‌లు, ఫైనళ్లకు కామెంటరీ చెప్పే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. టెలివిజన్ ప్రసార విధానంపై అవగాహన ఉండటంతో పాటు ఆటను అర్థం చేసుకునే వ్యక్తులతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందాన్నిస్తుంది. కామెంటరీలో సహచరుల మధ్య పరస్పర గౌరవం, సమన్వయం కూడా చాలా ముఖ్యం’ అని రవిశాస్త్రి వివరించారు.

1994లో కామెంటరీ, టీవీ ప్రసార రంగంలోకి అడుగుపెట్టిన రవిశాస్త్రి.. తొలి రోజుల్లోనే దిగ్గజ వ్యాఖ్యాతలతో కలిసి పనిచేసే అవకాశం దక్కించుకున్నారు. ఇయాన్ చాపెల్, డేవిడ్ గోవర్, జెఫ్రీ బాయ్‌కాట్, టోనీ గ్రెయిగ్, రిచీ బెనాడ్ వంటి ప్రముఖుల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా ఆటను ప్రేక్షకులకు ఎలా పరిచయం చేయాలి, దాని ఆసక్తిని ఎలా పెంచాలి అనే విషయాలను టోనీ నుంచి నేర్చుకున్నానని చెప్పారు. ప్రసారంలో క్రమశిక్షణను రిచీ నుంచి.. తన అభిప్రాయాలను నేరుగా, స్పష్టంగా చెప్పే విధానాన్ని చాపెల్ నుంచి తెలుసుకున్నానని వెల్లడించారు.

అయితే తన కామెంటరీ కెరీర్‌పై అత్యంత ప్రభావం చూపిన వ్యక్తి రిచీ బెనాడ్ అని రవిశాస్త్రి తెలిపారు. ఇంగ్లాండ్‌లో టెస్ట్ మ్యాచ్ స్పెషల్, బీబీసీ కోసం పనిచేసిన ఒక సీజన్ ముగిసిన తర్వాత.. తన కామెంటరీ ఎలా ఉందో చెప్పాలని బెనాడ్‌ను అడిగినట్లు గుర్తుచేసుకున్నారు. అప్పుడు ఆయన ఇచ్చిన సలహా తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చిందని చెప్పారు. ‘రిచీని నా కామెంటరీ ఎలా ఉందని అడిగాను. రవీ.. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడావన్నది ముఖ్యం కాదు. నువ్వు మాట్లాడిన మాటల్లో ఎంత విషయం ఉందన్నదే ముఖ్యం. టీవీలో కనిపిస్తున్న దృశ్యం కథను చెబుతున్నప్పుడు, దానికి నువ్వు అదనంగా ఏమీ జోడించలేకపోతే మౌనంగా ఉండు’ అని చెప్పినట్లు రవిశాస్త్రి వెల్లడించారు.

రేడియో కామెంటరీకి, టెలివిజన్ కామెంటరీకి మధ్య ఉన్న తేడాను కూడా బెనాడ్ తనకు వివరించారని రవిశాస్త్రి చెప్పారు. రేడియోలో మ్యాచ్‌ను వినేవారి కళ్ల ముందు దృశ్యాన్ని మాటలతో ఆవిష్కరించాల్సి ఉంటుందని, టెలివిజన్‌లో ప్రేక్షకులు ఆటను ప్రత్యక్షంగా చూస్తుంటారని తెలిపారు. అందువల్ల తెరపై కనిపిస్తున్న దృశ్యానికి అదనపు సమాచారాన్ని అందించగలిగినప్పుడే మాట్లాడాలని, లేదంటే మౌనంగా ఉండాలని బెనాడ్ సూచించినట్లు రవిశాస్త్రి గుర్తుచేసుకున్నారు. కామెంటరీలో ఎక్కువగా మాట్లాడటం కంటే.. సరైన సమయంలో విలువైన సమాచారాన్ని అందించడం ముఖ్యమని రిచీ ఇచ్చిన సలహా తనకు ఎంతో ఉపయోగపడిందని వివరించారు. తన ప్రసార కెరీర్‌ను తీర్చిదిద్దిన ఆ పాఠాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని రవిశాస్త్రి చెప్పుకొచ్చారు.