Site icon NTV Telugu

Ravi Shastri: అన్ని విరామాలు ఎందుకు.. ద్రవిడ్‌కి ఇచ్చిన బ్రేక్‌పై శాస్త్రి ఫైర్

Ravi Shastri On Dravid

Ravi Shastri On Dravid

Ravi Shastri On Rahul Dravid Breaks: ప్రస్తుతం న్యూజీలాండ్ పర్యటనలో ఉన్న భారత్.. ఆ జట్టుతో మూడేసి చొప్పున టీ20, వన్డే సిరీస్‌లు ఆడేందుకు సిద్ధమవుతోంది. అయితే.. ఈ రెండు సిరీస్‌లకు భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. దీనిపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి కొంచెం సీరియస్‌గా రియాక్ట్ అయ్యాడు. ద్రవిడ్ ఎందుకు పదే పదే విరామాలు తీసుకుంటున్నాడని ప్రశ్నించాడు. ప్రధాన కోచ్ అనేవాడు ఎప్పుడూ జట్టుకి అందుబాటులో ఉండాలని.. ఆటగాళ్లతో ఎక్కువ సమయం గడుపుతూ, జట్టుపై నియంత్రణను కలిగి ఉండాలని అన్నాడు. అంతే తప్ప.. పదే పదే విరామాలు తీసుకోవద్దని హితవు పలికాడు.

‘‘నాకు విరామాలపై ఏమాత్రం నమ్మకం లేదు. ఎందుకంటే.. నేను నా జట్టుని, ఆటగాళ్లను అర్థం చేసుకోవాలని అనుకుంటాను. అప్పుడే జట్టుపై నియంత్రణను కలిగి ఉండటానికి ఆస్కారం ఉంటుంది. అయినా.. మీకు (ద్రవిడ్‌ని ఉద్దేశిస్తూ) ఇన్ని విరామాలు ఎందుకు? టీ20 లీగ్ సమయంలో ఎలాగో రెండు, మూడు నెలల విరామం లభిస్తుందిగా! కోచ్‌గా విశ్రాంతి తీసుకోవడానికి ఆ సమయం సరిపోతుంది. కానీ, మిగతా సమయాల్లో జట్టుకి అందుబాటులో ఉండాలి. ఒకవేళ తాత్కాలికంగా ఎవరినైనా కోచ్‌గా నియమిస్తే, అప్పుడు కూడా ప్రధాన కోచ్ అనేవాడు ఆటగాళ్లకు అందుబాటులో ఉండాలి’’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. అనంతరం.. టీ20 వరల్డ్‌కప్ 2022 ఛాంపియన్‌గా నిలిచిన ఇంగ్లండ్ జట్టు అనుసరించిన విధానాలను అలవర్చుకోవాలని భారత టీ20 జట్టుకి శాస్త్రి సూచించాడు. కాగా.. ద్రవిడ్‌కి విశ్రాంతి ఇవ్వడంతో భారత తాత్కాలిక కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు.

ఇక ఇదే సమయంలో.. టీ20 ఫార్మాట్‌కు కొత్త కెప్టెన్‌ను నియమించడంలో తప్పు లేదని రవిశాస్త్రి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. రోహిత్ శర్మ ఎలాగో వన్డే, టెస్ట్ సిరీస్‌లకు సారథ్యం వహిస్తున్నాడని.. టీ20కి కొత్త కెప్టెన్ నియమిస్తే బాగుంటుందని పేర్కొన్నాడు. ఎందుకంటే.. మూడు ఫార్మాట్లను ఒక్క ఆటగాడే రాణించడం అంత సులువు కాదని తెలిపాడు. టీ20 ఫార్మాట్‌కు హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమిస్తే, అతను సమర్థవంతంగా జట్టుని ముందుకు నడిపించగలడని వెల్లడించాడు.

Exit mobile version