Rashid Khan Creates Rare Record In T20I: టీ20 క్రికెట్‌లో ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. ఆసియా కప్‌లో భాగంగా మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయడంతో.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రషీద్ ఖాన్ రెండో స్థానానికి ఎగబాకాడు. ఇంతకుముందు న్యూజీలాండ్ బౌలర్ టిమ్ సౌథీ 114 వికెట్లతో రెండో స్థానంలో ఉండేవాడు. అయితే.. బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో రషీద్ 4 ఓవర్లలో కేవలం 22 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. దీంతో.. అతని వికెట్ల సంఖ్య 115కి చేరడంతో, టిమ్ సౌథీ రికార్డ్ బద్దలైంది. మొదటి స్థానంలో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ (122 వికెట్ల) ఉన్నాడు.
కాగా.. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించడంతో, ‘సూపర్–4’ దశకు అర్హత సాధించింది. దీంతో.. ఆసియా కప్-2022లో ఆ అర్హత సాధించిన తొలి జట్టుగా ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది. గురువారం శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తుందో.. ఆ జట్టుకి ‘సూపర్–4’ రెండో బెర్త్ ఖరారవుతుంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 127 పరుగులు మాత్రమే చేసింది. టాపార్డర్‌తో పాటు మిడిలార్డర్ కూడా ఘోరంగా విఫలం అవ్వడంతో.. బంగ్లాదేశ్ భారీ స్కోర్ చేయలేకపోయింది. చివర్లో ముసాదిక్ (31 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే రాణించడంతో, కనీసం స్కోర్ అంత మాత్రమైనా వచ్చింది.
ఆ తర్వాత లక్ష్య చేధనకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు కూడా మొదట్లో తడబడింది. 13 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి.. కేవలం 62 పరుగులే చేసింది. అంటే.. లక్ష్యంలో సగం స్కోరు కూడా చేయలేదు. దీంతో.. ఆఫ్ఘన్ ఓటమి తప్పదేమోనని అంతా అనుమానించారు. అలాంటి సమయంలో నజీబుల్లా రంగంలోకి దిగి.. మెరుపు ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ని తిప్పేశాడు. కేవలం 17 బంతుల్లోనే 1 ఫోర్, ఆరు సిక్సర్ల సహాయంతో 43 పరుగులు చేసి.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇబ్రహీమ్ (41 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం జోడించి.. తన జట్టుని గెలిపించుకున్నాడు.
