Rashid Khan Picks 200 T20I Wickets: అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. పురుషుల అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. జింబాబ్వే వికెట్ కీపర్ బ్యాటర్ తడివనాషే మరుమానిని ఔట్ చేయడం ద్వారా రషీద్ ఖాతాలో 200వ వికెట్ చేరింది. దీంతో టీ20 క్రికెట్లో ఈ మైలురాయిని అందుకున్న తొలి బౌలర్‌గా నిలిచాడు. మొత్తంగా టీ20 క్రికెట్లోనూ రషీద్ లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. 551 మ్యాచ్‌ల్లో 742 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి రషీద్ ఖాన్ అఫ్గానిస్థాన్ బౌలింగ్ విభాగంలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. తన స్పిన్ మాయాజాలంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా జింబాబ్వేతో రెండో టీ20లో తడివనాషే మరుమానిని పెవిలియన్‌కు పంపించి 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. 120 ఇన్నింగ్స్‌ల్లో రషీద్ ఈ మైలురాయిని అందుకున్నాడు. అతడి ఖాతాలో రెండు ఐదు వికెట్ల హాల్స్ ఉన్నాయి. టీ20ల్లో 5/3 బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్. అత్యంత వేగంగా 200 వికెట్ల మార్క్‌ను అందుకున్న క్రికెటర్‌గానూ రషీద్ చరిత్రకెక్కాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ ఒక దశలో 38 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, మహమ్మద్ అక్రమ్, షాహిదుల్లా కమాల్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. సేదికుల్లా అటల్ 21 బంతుల్లో 17 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ సమయంలో అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇజాజ్ అహ్మద్ అహ్మద్జాయ్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు కేవలం 59 బంతుల్లోనే 142 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో అఫ్గానిస్థాన్ మళ్లీ పోటీలోకి వచ్చింది. ఇజాజ్ 27 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 52 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ రషీద్ ఖాన్ కూడా చివర్లో బ్యాట్‌తో మెరిశాడు. కేవలం ఆరు బంతుల్లోనే అజేయంగా 25 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో నాలుగు సిక్సర్లు ఉండటం విశేషం. అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్యానికి జింబాబ్వే 19 పరుగుల దూరంలో ఆగింది.
టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు:
రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్)-120 ఇన్నింగ్స్‌ల్లో 200 వికెట్లు
ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్)-146 ఇన్నింగ్స్‌ల్లో 171 వికెట్లు
ఎహ్సన్ ఖాన్ (హాంకాంగ్ )-116 ఇన్నింగ్స్‌ల్లో 165 వికెట్లు
ఇష్ సోదీ (న్యూజిలాండ్ )-135 ఇన్నింగ్స్‌ల్లో 165 వికెట్లు
టిమ్ సౌథీ (న్యూజిలాండ్)-123 ఇన్నింగ్స్‌ల్లో 164 వికెట్లు

