Rahul Dravid Clarity On Jasprit Bumrah Replacement: వెన్ను నొప్పి కారణంగా భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా టీ20 వరల్డ్‌కప్‌కు దూరమైన విషయం తెలిసిందే! అత్యంత కీలకమైన బౌలర్ జట్టుకి దూరం కావడంతో.. ఓవైపు కలవరంతో పాటు మరోవైపు అతడి స్థానంలో ఎవరిని తీసుకుంటారన్న ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే.. బుమ్రా స్థానంలో మహమ్మద్ షమీని తీసుకుంటారనే వార్తలు వచ్చాయి. బీసీసీఐ నుంచి ఇంకా అధికార ప్రకటన రాలేదు కానీ, దాదాపు షమీనే ఖరారు చేసినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు.
బుమ్రా స్థానంలో ఎవరిని తీసుకోవాలన్న అంశంపై ఇంకా పరిశీలించాల్సి ఉందని, తమకు ఇంకా అక్టోబర్ 15 వరకు సమయం ఉందని ద్రవిడ్ పేర్కొన్నాడు. స్టాండ్‌బై ఆటగాళ్లలో షమీ ఉన్నప్పటికీ.. బహుశా అతడు ఈ సిరీస్ ఆడలేకపోవచ్చని బాంబ్ పేల్చాడు. ఎందుకంటే.. 15 రోజుల పాటు కొవిడ్‌తో పోరాడిన అతడి ఆరోగ్య పరిస్థితిని ఇంకా సమీక్షించాల్సి ఉంటుందన్నాడు. ఎన్సీఏ ధ్రువీకరించిన తర్వాతే.. తామైనా, సెలెక్టర్లైనా ఓ నిర్ణయానికి రాగలమని చెప్పాడు. అయితే.. బుమ్రా స్థానంలో ఎవరు ఆడినా, తన ఆటను ఆస్వాదిస్తూనే జట్టుకు మేలు చేయగలిగితే చాలన్నారు. ఒక ఆటగాడి నుంచి తాము కోరుకునేది అదొక్కటేనని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.
ఇదే సమయంలో.. సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత వైఫల్యం గురించి ద్రవిడ్ మాట్లాడాడు. అన్ని విభాగాల్లోనూ ఆటతీరును మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తున్నామన్నాడు. డెత్ ఓవర్లలో ఆడటం అంత తేలిక కాదన్నాడు. ఈ విషయంలో ఒక్క భారత్ మాత్రమే కాదు.. బౌలింగ్‌లో ఎంతో అనుభవమున్న ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లకు సైతం డెత్ ఓవర్లలో గట్టెక్కేందుకు గట్టిగా పోరాడాల్సి వస్తుందని చెప్పాడు.
