NTV Telugu Site icon

లంక పర్యటనలో అందరికీ అవకాశం రాదు : ద్రవిడ్‌

శ్రీలంక పర్యటనలో కూడా ప్రతి ఒక్క ఆటగాడికి అవకాశం కల్పిస్తానని చెప్పిన ద్రవిడ్‌.. ఇప్పుడేమో అందరికీ అవకాశం​ ఇవ్వడం సాధ్యపడదని అంటున్నాడు. జట్టుకు ఎంపికై బెంచ్‌కే పరిమితం కావడం చాలా బాధిస్తుందని, ఆ బాధలను తాను కూడా అనుభవించానని చెప్పిన ఆయన..ఇప్పుడా మాటను దాట వేసినట్లుగా మాట్లాడాడు. కేవలం ఆరు మ్యాచ్‌ల లంక పర్యటనలో అందరికీ అవకాశం వస్తుందనుకోవడం సరికాదని, ఎవరికి అవకాశం ఇవ్వాలనేది సెలక్టర్లు చూసుకుంటారని వ్యాఖ్యానించాడు. తుది జట్టు ఎంపిక సెలక్టర్లు, మేనేజ్‌మెంట్ పరిధిలోని విషయమని, తమకు కావాల్సిన జట్టును వారు ఎంపిక చేసుకుంటారని ఆయన వివరించాడు. టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు కోసం చాలా మంది ఆటగాళ్లు ఎదురుచూస్తున్నారని, అయితే వారు సిరీస్ గెలవడాన్నే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించాడు. టీ20 ప్రపంచకప్‌ బెర్తు కోసం అందరూ పోటీపడవచ్చంటూనే, అవకాశం వచ్చిన వాళ్లు ఈ పర్యటనను సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు. కాగా, శ్రీలంక పర్యటనలో భారత జట్టు.. మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.