Site icon NTV Telugu

Quinton de Kock Century: రీఎంట్రీలో రెచ్చిపోతున్న డికాక్.. కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్!

Quinton De Kock Century

Quinton De Kock Century

దక్షిణాఫ్రికా సీనియర్ ఓపెనర్ క్వింటన్‌ డికాక్‌ అంతర్జాతీయ టీ20లో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రీఎంట్రీలో డికాక్‌ వరుసగా విఫలమయ్యాడు. మొదటి ఐదు ఇన్నింగ్స్‌లలో 1, 23, 7, 0, 0 స్కోర్లు మాత్రమే చేశాడు. దాంతో అతడిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. గత డిసెంబర్‌లో భారత్‌తో ముల్లాన్‌పుర్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఫామ్ అందుకున్నాడు. కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 46 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సులతో 90 పరుగులు బాదాడు. ఇక గురువారం వెస్టిండీస్‌తో సెంటూరియన్‌లో జరిగిన మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. 49 బంతుల్లో ఏకంగా 115 రన్స్ చేశాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ లక్ష్యం ముందున్నా.. ప్రోటీస్ బ్యాటర్లు ఏమాత్రం బెదరలేదు. క్వింటన్‌ డికాక్, ర్యాన్ రికెల్టన్ వెస్టిండీస్ బౌలర్లపై విరుచుకుపడడడంతో.. దక్షిణాఫ్రికా కేవలం 11.5 ఓవర్లలోనే 3 వికెట్స్ కోల్పోయి 225 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. డికాక్, రికెల్టన్ తమ కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌లు ఆడారు. రికెల్టన్ 36 బంతుల్లో అజేయంగా 77 పరుగులు చేశాడు. డికాక్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే అసలైన విధ్వంసం సృష్టించాడు. వెస్టిండీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ సిక్సర్లు బాదాడు. 10 సిక్సులు, 6 ఫోర్లతో 115 పరుగులు బాదాడు.

Also Read: Virat Kohli Instagram: కింగ్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ గల్లంతు.. అనుష్కకు ప్రశ్నల వర్షం!

క్వింటన్‌ డికాక్ కేవలం 21 బంతుల్లోనే అర్ధ శతకం చేశాడు. 43 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. అకీల్ హొసైన్ బౌలింగ్‌లో వరుసగా మూడో సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించి.. మిడ్-ఆఫ్ వద్ద క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇదే అతడి రెండో టీ20 సెంచరీ. 2023లో ఇదే మైదానంలో వెస్టిండీస్‌పైనే డికాక్ శతకం బాదాడు. ఈ విజయంతో దక్షిణాఫ్రికా సిరీస్‌ను 2-0తో ఖాయం చేసుకుంది. మూడో టీ20 మ్యాచ్ శనివారం జరగనుండగా.. ఆ తర్వాత రెండు జట్లు భారత్, శ్రీలంక వేదికలుగా ప్రారంభమయ్యే టీ20 వరల్డ్‌కప్‌కు బయల్దేరనున్నాయి.

Exit mobile version