NTV Telugu Site icon

PV Sindhu: ఆ అన్యాయంపై కమిటీ క్షమాపణలు

Pv Sindhu Recieves Sorry

Pv Sindhu Recieves Sorry

రిఫరీ చేసిన తప్పిదం వల్ల బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌సిప్ టోర్నీలో ఓటమి పాలైన పివి సింధుకి తాజాగా కమిటీ క్షమాపణలు చెప్పింది. ఆ మానవ తప్పిదానికి సారీ చెప్తున్నామని, ఇలాంటి పొరబాట్లు భవిష్యత్తులో జరగకుండా చూస్తామని బ్యాడ్మింటన్ ఆసియా టెక్నికల్ కమిటీ ఛైర్మన్ చిహ్ షెన్ చెన్ తెలిపారు. ‘‘ఆసియా ఛాంపియన్‌షిప్‌లో మీకు (పీవీ సింధు) కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్తున్నాం. ఇప్పుడు ఆ పొరబాటుని సరిదిద్దే అవకాశం లేదు. అయితే, భవిష్యత్తులో ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటాం. ఇదంతా ఆటల్లో ఓ భాగమేనని, దాన్ని మీరు అంగీకరిస్తారని విశ్వసిస్తున్నాం’’ అని ఛైర్మన్ లేఖలో పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే.. ఏప్రిల్‌లో జరిగిన ఆ టోర్నీలో భాగంగా సెమీ ఫైనల్‌లో అకానె యమగూచితో తలపడుతున్నప్పుడు రిఫరీ ఓ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. తొలి గేమ్ సొంతం చేసుకున్న సింధూ.. రెండో గేమ్‌లో 14-11తో ఆధిపత్యంలో దూసుకుపోతున్నప్పుడు సర్వీస్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకుందన్న కారణంతో యమగూచికి ఒక పాయింట్ ఫ్రీగా కేటాయించాడు. దీంతో స్కోర్ 14-12గా మారింది. యమగూచి సిద్ధంగా లేకపోవడం వల్లే తాను సమయం తీసుకున్నానని సింధు వివరించే ప్రయత్నం చేసినా.. రిఫరీ వినిపించుకోకుండా ప్రత్యర్థికి పాయింట్ ఇచ్చేశాడు. దాని తర్వాత యమగూచి మ్యాచ్‌పై పట్టు సాధించి, 19-21 తేడాతో గేమ్ సొంతంచేసుకుంది. మూడో గేమ్ కూడా 16-21తో గెలవడంతో.. మ్యాచ్ సింధు చేజారింది.

రిఫరీ చేసిన ఆ తప్పిదంపై అప్పుడే సింధు ఆసియా బ్యాడ్మింటన్ ఫెడరేషన్‌కు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలోనే తనకు అన్యాయం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన ప్రత్యర్థికి ఆ పాయింట్ ఇవ్వకపోయి ఉంటే, తాను విజయానికి చేరువయ్యేదానినని తెలిపింది. అనవసరంగా పాయింట్ కోల్పోవడంతో 14-12గా స్కోరు మారిందని తెలిపింది. దీనిపై విచారించిన కమిటీ.. రిఫరీ తప్పిదానికి సారీ చెప్పింది.