భారత స్టార్ షట్లర్, రెండుసార్లు ఒలింపిక్ మెడలిస్ట్ పి.వి.సింధు ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లారు. శనివారం (అక్టోబర్ 24) జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంకర్, జపాన్ క్రీడాకారిణి హీనా అకేచిపై సింధు అద్భుత విజయం సాధించారు. గంటా 13 నిమిషాల పాటు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో 21-10, 20-22, 21-16 తేడాతో విజయం సాధించి, ఈ ఏడాది తన రెండో సూపర్ 750 ఫైనల్‌లో అడుగుపెట్టారు. గత జులైలో జపాన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సింధుకు ఇది ఈ ఏడాది మరో పెద్ద విజయం.
తొలి గేమ్‌లో సింధు ఏకపక్ష ఆధిపత్యం
తొలి గేమ్ ప్రారంభంలో ఇరు క్రీడాకారిణులు హోరాహోరీగా తలపడటంతో స్కోరు 4-4, 8-8తో సమమైంది. ఆ తర్వాత లయ అందుకని 11-9 ఆధిక్యంతో విరామానికి వెళ్లిన భారత స్టార్, ఆ తర్వాత ఊహించని రీతిలో చెలరేగిపోయారు. కేవలం 18 నిమిషాల్లోనే వరుసగా 12 పాయింట్లలో 11 పాయింట్లు ఖాతాలో వేసుకుని 21-10 తేడాతో తొలి గేమ్‌ను సునాయసంగా కైవసం చేసుకున్నారు.
రెండో గేమ్‌లో జపాన్ క్రీడాకారిణి బలమైన కంబాక్
రెండో గేమ్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్ సింధుకు గట్టి పోటీ ఎదురైంది. మొదట్లో నాలుగు పాయింట్లు వెనుకబడినప్పటికీ, సింధు తిరిగి పుంజుకుని స్కోరును 7-7తో సమం చేశారు. తన పవర్ ఫుల్ షాట్లు, క్రాస్ కోర్ట్ దాడులతో స్కోరును 14-14, 16-16తో రసవత్తరంగా మార్చారు. అయితే, ఆఖరి నిమిషాల్లో జపాన్ షట్లర్ తీవ్రంగా పోరాడి గేమ్ పాయింట్ సాధించింది. మొదటి గేమ్ పాయింట్‌ను సింధు కాపాడుకున్నప్పటికీ, ఆ తర్వాత చేసిన చిన్న పొరపాటుతో రెండో గేమ్‌ను 20-22తో అకేచి కైవసం చేసుకుంది.
నిర్ణయాత్మక మూడో గేమ్.. 38 షాట్ల ర్యాలీతో మ్యాచ్ తిరిగిన మలుపు
ఫైనల్ బెర్తును తేల్చే మూడో గేమ్ తీవ్ర ఉత్కంఠ నడుమ సాగింది. 5-3 ఆధిక్యంతో నిలిచిన సింధును జపాన్ క్రీడాకారిణి నెట్ ప్లేతో గట్టి సవాల్ విసిరి స్కోరును 15-15తో సమం చేసింది. అయితే, మ్యాచ్‌కు అసలైన మలుపు తిరిగింది 18-16 వద్ద జరిగిన సుదీర్ఘమైన 38 షాట్ల ర్యాలీతోనే! అకేచి చేసిన నెట్ ఎర్రర్ వల్ల ఈ పాయింట్ సింధు ఖాతాలో పడింది. అదే ఉత్సాహంతో సింధు వరుస పాయింట్లు సాధించి 4 మ్యాచ్ పాయింట్లు సాధించారు. ఆఖరిగా పవర్ ఫుల్ క్రాస్ కోర్ట్ స్మాష్‌తో గేమ్‌ను 21-16తో ముగించి ఫైనల్ పిలుపు అందుకున్నారు.
ఫైనల్లో ప్రపంచ నంబర్ 1 అన్ సే-యంగ్ తో పోరు..
ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో ప్రపంచ నంబర్ వన్, దక్షిణ కొరియా స్టార్ షట్లర్ అన్ సే-యంగ్‌తో సింధు తలపడనున్నారు. ఫైనల్ మ్యాచ్‌పై సింధు స్పందిస్తూ.. “ఫైనల్‌కు చేరుకోవడం సంతోషంగానే ఉంది, కానీ పని ఇంకా పూర్తి కాలేదు. ఫైనల్‌పై దృష్టి సారించాల్సి ఉంది. ఆమె ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉంది. గతంలో మేము చాలాసార్లు తలపడ్డాం. రేపు సరికొత్త రోజు, ప్రతి పాయింట్ ముఖ్యం. మైదానంలో నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తూ ఆమెకు గట్టి పోటీ ఇస్తాను” అని స్పష్టం చేశారు. గాయాలు, ఫామ్ లేమితో ఇబ్బంది పడిన సమయం నుంచి కోలుకోవడానికి కొత్త సపోర్ట్ టీమ్, శిక్షణ పద్ధతుల్లో చేసిన మార్పులు ఎంతగానో ఉపయోగపడ్డాయని సింధు ఈ సందర్భంగా వెల్లడించారు.

