ఐపీఎల్‌లో మరో మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఆదివారం రాత్రి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని సైతం పంజాబ్ కింగ్స్ చేధించింది. ఇరు జట్ల ఆటగాళ్లు బౌండరీలతో డీవై పాటిల్ స్టేడియాన్ని మోతెక్కించారు. దీంతో అభిమానులకు కావాల్సినంత మజా దక్కింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 205/2 స్కోరు సాధించింది. కెప్టెన్ డుప్లెసిస్ (88), విరాట్ కోహ్లీ (41), దినేష్ కార్తీక్ (32), అనుజ్ రావత్ (21) రాణించారు.
అయితే బెంగళూరు నిర్దేశించిన 206 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే పంజాబ్ కింగ్స్ ఛేదించింది. పంజాబ్ ఆటగాళ్లలో శిఖర్ ధావన్(43), రాజపక్స(43), మయాంక్ అగర్వాల్ (32) రాణించారు. ఒక దశలో 156 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినా చివర్లో ఓడియన్ స్మిత్ 8 బంతుల్లో 25 నాటౌట్, షారుఖ్ ఖాన్ 20 బంతుల్లో 24 నాటౌట్ మెరుపులు మెరిపించడంతో పంజాబ్ సునాయసంగా విజయం సాధించింది.
