PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!

Pbks 2025 Ipl Final

Pbks 2025 Ipl Final

Punjab Kings-IPL 2027: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే పంజాబ్ కింగ్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. హెడ్ కోచ్ రికీ పాంటింగ్ సహాయక బృందంలోని ఇద్దరు కీలక సభ్యులు తమ పదవుల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఫాస్ట్ బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్, ఫీల్డింగ్ కోచ్ బ్రాడ్ హాడిన్ పంజాబ్ కింగ్స్‌ను వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియాకు చెందిన హోప్స్, హాడిన్ తమ నిర్ణయాలను ఇటీవలే పంజాబ్ కింగ్స్ యాజమాన్యానికి తెలియజేశారని క్రిక్‌బజ్ పేర్కొంది. వీరిద్దరికీ బిగ్ బాష్ లీగ్‌ (బీబీఎల్‌)లో అవకాశం వచ్చినట్లు సమాచారం.

జేమ్స్ హోప్స్ పంజాబ్ కింగ్స్‌కు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా సేవలందించారు. అంతకుముందు రికీ పాంటింగ్‌తో కలిసి ఢిల్లీ క్యాపిటల్స్‌లోనూ పనిచేశాడు. పాంటింగ్‌తో ఉన్న అనుబంధం కారణంగా పంజాబ్ జట్టులో చేరాడు. ఇప్పుడు హోప్స్ నిష్క్రమణతో బౌలింగ్ విభాగానికి కొత్త కోచ్‌ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. మరోవైపు బ్రాడ్ హాడిన్ ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. పాంటింగ్ పంజాబ్ కింగ్స్‌లో చేరకముందే హాడిన్ జట్టు సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్నాడు. గతంలో ట్రెవర్ బేలిస్ కోచ్‌గా ఉన్న సమయంలో ఆయనను నియమించారు. హోప్స్, హాడిన్ స్థానాలకు సరైన ప్రత్యామ్నాయాలను ఎంపిక చేసే బాధ్యత పాంటింగ్‌పైనే ఉండనుంది. కోచింగ్ సిబ్బందిలో మార్పులపై పాంటింగ్, ఫ్రాంచైజీ యాజమాన్యం చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. డిసెంబర్‌లో జరగనున్న ఐపీఎల్ 2027 వేలానికి ముందే కొత్త కోచ్‌ల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని పంజాబ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

పంజాబ్ కింగ్స్‌లో మరో కోచ్ స్థానం కూడా ఖాళీగా ఉంది. స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన సాయిరాజ్ బహుతులే ఐపీఎల్ 2026 తర్వాత ఆ జట్టును వీడి భారత జట్టు సహాయక సిబ్బందిలో చేరారు. అంతకుముందు పంజాబ్ కింగ్స్‌లో ఈ బాధ్యతలు నిర్వహించిన సునీల్ జోషి బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో స్పిన్ బౌలింగ్ విభాగానికి మారడంతో.. ఆయన స్థానంలో బహుతులేను నియమించారు. దీంతో ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు పంజాబ్ కనీసం ముగ్గురు కోచ్‌లను కొత్తగా నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియ, వేలం సన్నాహాలు సమీపిస్తున్న నేపథ్యంలో కోచింగ్ బృందాన్ని పటిష్ఠం చేసుకోవడం పాంటింగ్‌కు కీలకంగా మారింది.

ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ 14 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు, ఆరు ఓటములతో 15 పాయింట్లు సాధించింది. +0.309 నెట్ రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. గుజరాత్ టైటాన్స్‌పై మూడు వికెట్ల విజయంతో టోర్నీని ప్రారంభించిన పంజాబ్.. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్‌పై కూడా విజయాలు సాధించింది. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటములు ఎదురవడంతో జట్టు టాప్‌-4లో నిలిచే అవకాశాన్ని కోల్పోయింది. చివరి లీగ్ మ్యాచ్‌లో లక్నోపై ఏడు వికెట్ల తేడాతో గెలిచినప్పటికీ ఐదో స్థానానికే పరిమితమైంది. ఐపీఎల్ 2027లో పంజాబ్ తిరిగి పుంజుకుంటుందా? లేదా అనేది చూడాలి.