Site icon NTV Telugu

Anil Kumble: అనిల్ కుంబ్లేకు షాక్ ఇవ్వనున్న పంజాబ్ కింగ్స్..?

Anil Kumble

Anil Kumble

Anil Kumble: ప్రస్తుతం ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌ కోచ్‌గా మాజీ దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే వ్యవహరిస్తున్నాడు. అయితే వచ్చే ఐపీఎల్‌లో కుంబ్లేకు పంజాబ్ కింగ్స్ షాక్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సెప్టెంబర్‌తో కుంబ్లేకు పంజాబ్‌ కింగ్స్‌తో ఉన్న మూడేళ్ల ఒప్పందం ముగియనుంది. మళ్లీ అతడితో ఒప్పందాన్ని రెన్యువల్‌ చేసుకునేందుకు పంజాబ్‌ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. కోచ్‌గా అతడి స్థానంలో మరో క్రికెటర్‌కు ఆ బాధ్యతలను అప్పగించనుందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ పదవికి రేసులో ఇయాన్‌ మోర్గాన్‌, ట్రేవర్ బెలిస్, రవిశాస్త్రి పోటీ పడుతున్నారు. ఇంగ్లండ్ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సెప్టెంబరులో భారత్‌లో జరగనున్న లెజెండ్స్ లీగ్‌లో అతను ఆడనున్నాడు. 2019లో వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లండ్‌కు అందించిన కెప్టెన్‌గా మోర్గాన్ చరిత్ర సృష్టించాడు.

Read Also: శ్రీకృష్ణుడి గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు

అటు ఐపీఎల్ 14వ ఎడిషన్‌లో బలమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ కేవలం 2 పాయింట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ మొత్తం 14 మ్యాచ్‌లు ఆడగా ఏడు విజయాలు, ఏడు పరాజయాలతో 14 పాయింట్లు మాత్రమే సాధించింది. దీంతో వచ్చే ఐపీఎల్ ఎడిషన్‌కు కోచ్‌ను మార్చాలని పంజాబ్ కింగ్స్ భావిస్తోంది. ఇయాన్ మోర్గాన్‌ గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ట్రేవర్ బెలిస్ గతంలో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో పాటు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు కోచింగ్ టీమ్‌లో బాధ్యతలు వ్యవహరించాడు. ఇక రవిశాస్త్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీమిండియాకు కోచ్‌గా రవిశాస్త్రి ఎన్నో మధురమైన విజయాలను అందించాడు. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్‌ కోచ్‌గా ఎవరిని నియమిస్తుందో వేచి చూడాలి.

Exit mobile version