NTV Telugu Site icon

PT Usha: వారి వల్ల దేశం పరువు పోతోంది.. పీటీ ఉష వివాదాస్పద వ్యాఖ్యలు

Pt Usha Wrestlers Protest

Pt Usha Wrestlers Protest

PT Usha Controversial Comments On Wrestlers Protest: భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే! రెజర్లపై బ్రిజ్‌ భూషణ్‌ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన చేపట్టారు. ఈ నిరసనలో భజరంగ్‌ పూనియా, వినేష్‌ ఫోగట్‌, సాక్షి మాలిక్‌, సహా ఇతర ప్రముఖ రెజ్లర్లు పాల్గొన్నారు. వీరికి ఇతర క్రీడాకారులు మద్దతుగా నిలుస్తుంటే.. భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు, దిగ్గజ అథ్లెట్‌ పీటీ ఉష మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. వారు వీధుల్లోకి వెళ్లకుండా ఉండాల్సిందని, తమ వద్దకు వచ్చి ఫిర్యాదు చేసి ఉంటే బాగుండేదని అన్నారు. వాళ్లు చేస్తున్న నిరసనల వల్ల.. దేశం పరువు పోతోందంటే కుండబద్దలు కొట్టారు.

Delhi Liquor Case: మనీష్ సిసోడియాకు మరోసారి బెయిల్ నిరాకరణ..

పీటీ ఉష మాట్లాడుతూ.. ‘‘లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు భారత ఒలంపిక్ సంఘంలో ఒక కమిటీ ఉంది. అలాగే అథ్లెటిక్స్‌ కమిషన్‌ కూడా ఉంది. బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన వారంతా వీధుల్లోకి వెళ్లకుండా మా వద్దకు రావాల్సింది. కానీ వారు అలా చేయలేదు. కొంత క్రమశిక్షణ అనేది అవసరం. ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు మంచి పేరుంది. అయితే.. వాళ్లు చేపట్టిన ఇలాంటి నిరసనల వల్ల దేశం పరువు పోతోంది. ఈ తరహా ప్రతికూల ప్రచారం దేశానికి ఏమాత్రం మంచిది కాదు. ఏదైనా చట్టప్రకారం ముందుకు సాగాలి. వారందరూ ధర్నాలో కూర్చొని, రాజకీయ పార్టీల మద్దతు కోరడం నన్ను తీవ్రంగా నిరాశపరుస్తోంది’’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ విధంగా పిటి ఉష చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె వ్యాఖ్యలకు కొందరు మద్దతు తెలిపితే.. మరికొందరు మాత్రం ఫైర్ అవుతున్నారు.

Dwayne Bravo: ధోనీ అందుకే బ్యాటింగ్‌కి దిగడు.. డ్వేన్ బ్రావో క్లారిటీ

ఉష మాటలపై స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆమె స్వయంగా ఒక అథ్లెట్‌ అని, పైగా మహిళ అని, తాము ఆమె మద్దతు కోరుకున్నామని, కానీ ఆమె నుంచి ఇలాంటి స్పందన వస్తుందని తాము ఊహించలేదని తెలిపాడు. రెజ్లర్ల చర్య వల్ల భారత్‌ పరువు పోతోందని భావిస్తే.. గతంలో తన అకాడమీలో కొందరు గూండాలు తనను వేధిస్తున్నారంటూ ఆమె అందరి ముందు ఏడవలేదా? అప్పుడేం జరిగింది? అంటూ తీవ్రంగా మండిపడ్డాడు. ఆ సమయంలో ఆమెకు దేశం పరువు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Show comments