NTV Telugu Site icon

Chess Olympiad: చెస్ ఒలింపియాడ్ షురూ.. ప్రధాని మోదీ చేతుల మీదుగా పోటీలు ప్రారంభం

Chess Olympiad

Chess Olympiad

Chess Olympiad: తమిళనాడు వేదికగా 44వ ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌-2022 పోటీలు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్​, సూపర్‌స్టార్ రజనీకాంత్ సహా పలువురు ప్రముఖులు ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జులై 28 నుంచి ఆగస్ట్‌ 10 వరకు జరిగే చెస్‌ ఒలింపియాడ్‌లో పాల్గొనేందుకు ప్రపంచ దేశాల నుంచి ఆటగాళ్లు తరలివచ్చారు.ఈ పోటీలు మహాబలిపురంలోని పూంజేరి గ్రామంలో జరగనున్నాయి. స్టేడియంలో ఎక్కడ చూసినా నలుపు, తెలుపు గడులు కనిపించేలా తీర్చిదిద్దారు. భారీ చెస్ పావులను ఏర్పాటు చేశారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ఏర్పాటు చేసిన సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ప్రారంభోత్సవ వేడుకలకు ముందు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చెస్ ఒలింపియాడ్ వేదికలను, జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం, మహాబలిపురంలో పూంజేరిలో నిర్వహించే ఏర్పాట్లను పరిశీలించారు. స్టాలిన్ ఇక్కడికి సమీపంలోని మహాబలిపురం ప్రవేశ ద్వారం వద్ద ప్రభుత్వ యాజమాన్యంలోని పూంపుహార్ (తమిళనాడు హస్తకళల అభివృద్ధి సంస్థ) కళాకారులచే చెక్కబడిన అద్భుతమైన శిల్పాన్ని కూడా ప్రారంభించారు. మోదీ పర్యటన దృష్ట్యా గ్రేటర్ చెన్నై పోలీసులు ఐదు అంచెల భద్రతను ఏర్పాటు చేసి 22,000 మంది సిబ్బందిని మోహరించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 144 ప్రకారం జూలై 28 మరియు 29 తేదీల్లో డ్రోన్‌లు, ఇతర మానవ రహిత వైమానిక వాహనాలను ఎగురవేయడం నగర పరిధిలో నిషేధించబడింది.

ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగిన రష్యాపై వేటు పడడం వల్ల అనూహ్యంగా ఒలింపియాడ్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని భారత్ దక్కించుకుంది. దీంతో పోటీల కోసం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 190 దేశాల క్రీడాకారులు పాల్గొనే ఈ టోర్నీలో.. ఓపెన్‌, మహిళల విభాగంలో పోటీలు జరుగుతాయి. రెండు విభాగాల్లో మూడేసి చొప్పున భారత్‌ ఆరు జట్లను బరిలోకి దించుతోంది. తెలుగు తేజాలు పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, అర్జున్‌ ఎరిగైసి వివిధ జట్లలో కీలక క్రీడాకారులుగా బరిలోకి దిగుతున్నారు. ద్రోణవల్లి హారిక ఎనిమిది నెలల గర్భంతో ఉన్నప్పటికీ పోటీల్లో పాల్గొంటుండటం గమనార్హం. దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ ఈ సారి పోటీలకు దూరంగా ఉన్నాడు. ఆయన ఈ సారి భారత జట్లకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రపంచ చెస్ ఛాంప్ కార్ల్‌సన్ నార్వే జట్టుకు ఆడుతూ.. టోర్నీకే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు.

Aircraft Carrier Vikrant: భారత మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ‘విక్రాంత్’ నేవీకి అప్పగింత

ఇదిలా ఉండగా.. భారత్‌లో జరుగుతున్న చెస్ ఒలింపియాడ్ నుంచి పాక్ వైదొలిగింది. వారి జట్టు ఇక్కడకు చేరుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అంతర్జాతీయ ఈవెంట్‌ను సైతం పాకిస్థాన్ రాజకీయం చేస్తోందని భారత విదేశాంగ శాఖ మండిపడింది. ఈవెంట్ ప్రారంభమైన తర్వాత వైదొలుగుతున్నట్లు పాక్ ప్రకటించిందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.