NTV Telugu Site icon

Neeraj Chopra: ఢిల్లీ నుంచి గల్లీ వరకు నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం

Pm Modi Congratulations To Neeraj Chopra

Pm Modi Congratulations To Neeraj Chopra

PM Modi Appreciates Neeraj chopra: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్‌తో సత్తా చాటిన నీరజ్ చోప్రాపై ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రశంసల వర్షం కురుస్తోంది. నీరజ్ చోప్రా విజయాన్ని పురస్కరించుకుని అతడి స్వగ్రామమైన హర్యానాలోని పానిపట్‌లో కుటుంబసభ్యులు, స్నేహితులు డ్యాన్సులు చేశారు. మరోవైపు నీరజ్ చోప్రాకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. భారత ఖ్యాతిని నీరజ్ నిలబెట్టాడని, గర్వంగా ఉందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భారత అత్యున్నత అథ్లెట్లలో నీరజ్ ఒకడని కీర్తించారు. భారత క్రీడల్లో ఇదో ప్రత్యేకమైన రోజు అని కొనియాడారు. భవిష్యత్‌లో మరిన్ని టోర్నీల్లో నీరజ్ చోప్రా పతకాలు సాధించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.

అటు పలువురు కేంద్ర మంత్రులు కూడా నీరజ్ చోప్రాపై ప్రశంసలు కురిపించారు. నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. అతను అంజు బాబీ జార్జ్ తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన మొదటి భారతీయుడు కావడంతోపాటు రెండో భారతీయుడు అని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు.

Read Also: Asia Cup 2022: అదరగొడుతున్న ఆసియా కప్ ప్రోమో.. నంబర్ వన్ మేరా ఇండియా..!!

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా అమెరికాలోని యూజీన్‌లో ఆదివారం ఉదయం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్‌లో 88.13 మీటర్లు జావెలిన్ విసిరి నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. అటు భారత్ తరపున మెడల్ సాధించడం గర్వంగా ఉందని నీరజ్ చోప్రా అన్నాడు. ఇప్పుడు సిల్వర్ వచ్చిందని, వచ్చేసారి దాని రంగు మార్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. బంగారు పతకంపై ఆకలిగా ఉన్నానని నీరజ్ చోప్రా వెల్లడించాడు. ఫైనల్స్ టైంలో పరిస్థితులు బాగా లేవని, గాలి చాలా వేగంగా వీచిందని తెలిపాడు. ఒలింపిక్ ఛాంపియన్ అనే ఒత్తిడికి గురి కాలేదని, తన బలంపై నమ్మకం పెట్టుకుని ఆడానని నీరజ్ చోప్రా వివరించాడు.