టీ20 ప్రపంచకప్‌లో ఆదివారం రసవత్తర పోరు జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ ఆదివారం రాత్రి 7:30 గంటలకు జరగనుంది. ఈ నేపథ్యంలో భారత్‌తో తలపడే తుది జట్టును పాకిస్థాన్ ఒకరోజు ముందే ప్రకటించింది. 12 మంది సభ్యులతో పాక్ టీమ్ జట్టును ప్రకటించగా.. అందులో బాబర్ ఆజమ్ (కెప్టెన్), అసిఫ్ అలీ, ఫకార్ జమాన్, హైదర్ అలీ, మహ్మద్ రిజ్వాన్, ఇమాద్ వసీమ్, మహ్మద్ హఫీజ్, షాదాబ్ ఖాన్, షోయబ్ మాలిక్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, షహీన్ షా అఫ్రిదీ ఉన్నారు.
Read Also: నేటి నుంచే సూపర్-12 మ్యాచ్‌లు ప్రారంభం
కాగా ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్‌లలో భారత్, పాకిస్థాన్ జట్లు ఐదుసార్లు తలపడ్డాయి. ఈ ఐదు సార్లు కూడా భారతే విజేతగా నిలిచింది. 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లోనే ఈ రెండు జట్లు రెండు సార్లు తలపడ్డాయి. అప్పుడు టీమిండియా కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నాడు. లీగ్ దశలో ఒకసారి, ఫైనల్లో మరోసారి భారత్, పాక్ అమీతుమీ తేల్చుకున్నాయి. లీగ్ దశలో మ్యాచ్ టై కాగా బౌలౌట్‌లో ధోనీ సేన విజయం సాధించింది. ఇక ఫైనల్ మ్యాచ్‌లో ఓపెనర్ గంభీర్ వీరవిహారం చేయడంతో టీమిండియా తొలిసారి పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడింది.