Site icon NTV Telugu

Pakistan vs South Africa: సౌతాఫ్రికా చిత్తు.. పాకిస్తాన్ ఘనవిజయం

Pakistan Won Match

Pakistan Won Match

Pakistan Won Against South Africa In T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా గురువారం సౌతాఫ్రికాతో ఆడిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 33 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. పాక్ బౌలర్ల ధాటికి సఫారీ ఆటగాళ్లు కుప్పకూలడంతో.. ఈ విజయాన్ని పాక్ సొంతం చేసుకోగలిగింది. వరుణుడు కూడా పాక్ గెలుపులో కీలక పాత్ర పోషించాడని చెప్పుకోవచ్చు. తొలుత టాస్ గెలిచిన బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. నిజానికి.. పాక్ జట్టు 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోవడంతో, తక్కువ స్కోరుకే చాపచుట్టేస్తుందని అంతా భావించారు. కానీ.. ఇఫ్తికార్ అహ్మద్ (51), షాదాబ్ ఖాన్ (52) అర్థశతకాలతో చెలరేగడంతో పాటు మహ్మద్ హారిస్ (28), మహమ్మద్ నవాజ్ (28) రాణించడంతో.. పాక్ జట్టు 185 పరుగులు చేయగలిగింది.

ఇక 186 లక్షంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టుకి మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ హిట్టర్ క్వింటన్ డీకాక్ డకౌట్ అయ్యాడు. అనంతరం రుస్సో కూడా 7 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే.. ఈ టోర్నీలో మొదట్నుంచి నిరాశపరుస్తూ వస్తున్న కెప్టెన్ తెంబా బావుమా మాత్రం ఈసారి మెరుపులు మెరిపించాడు. 19 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ సహాయంతో 36 పరుగులు చేసి చమత్కరించాడు. అతనితో పాటు మర్క్‌రమ్ (20) కొద్దివరకు లాక్కొచ్చాడు. అయితే.. 9 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు 69/4 గా ఉన్నప్పుడు వర్షం పడింది. సుమారు అరగంట పాటు దంచికొట్టింది. ఆ తర్వాత వరుణుడు శాంతించడంతో.. డీఎల్ఎస్ మెథడ్‌లో 14 ఓవర్లకు టార్గెట్‌ను 142కి కుదిరించారు. ఆల్రెడీ 9 ఓవర్లు అయిపోయాయి కాబట్టి.. 5 ఓవర్లలో 73 పరుగులు చేయాలి. ప్రధానమైన నాలుగు వికెట్లు కూడా పోయాయి కాబట్టి.. ఆ టార్గెట్ చేధించడం సఫారీలకు కత్తి మీద సాము అయ్యింది.

వచ్చిన ప్రతీ ఒక్కరు భారీ షాట్లకు ప్రయోగించి, పెవిలియన్ చేరారు. దీంతో.. పరుగులు రాకపోగా, సౌతాఫ్రికా వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఇంతకుముందు ఇతర మ్యాచెస్‌లో చమత్కారాలు చూపించిన వాళ్లందరూ ఈ మ్యాచ్‌లో చేతులు ఎత్తేశారు. దీంతో.. 14 ఓవర్లలో సౌతాఫ్రికా 108 పరుగులే చేయగలిగింది. ఫలితంగా.. పాక్ జట్టు 33 పరుగుల తేడాతో గెలుపొందింది. పాక్ బౌలర్లలో షాహీన్ ఆఫ్రీది 3 వికెట్లు, షాదాబ్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. నసీమ్ షా, హారిస్ రౌఫ్, మహమ్మద్ వసీమ్ చెరో వికెట్ తీశారు. ఈ గెలుపుతో పాక్ పాయింట్ల పట్టికలో 4 పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాకింది.

Exit mobile version