NTV Telugu Site icon

Asad Rauf: మాజీ అంపైర్ అసద్ రౌఫ్ గుండెపోటుతో హఠాన్మరణం

Asad Rauf Cardiac Arrest

Asad Rauf Cardiac Arrest

Pakistan Former Umpire Asad Rauf Dies Due To Cardiac Arrest: పాకిస్తాన్‌కు చెందిన ఐసీసీ మాజీ అంపైర్ అసద్ రౌఫ్ (66) కన్నుమూశారు. గురువారం (సెప్టెంబర్ 15) గుండెపోటుతో ఆయన హఠాన్మారణం పొందారు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు తాహిర్ రౌఫ్ స్పష్టం చేశారు. లాహోర్‌లోని లాండా బజార్‌లో ఓ బట్టల దుకాణం నిర్వహిస్తున్న అసద్ రౌఫ్.. ఎప్పట్లాగే బుధవారం రాత్రి దుకాణం మూసేసి ఇంటికి వెళ్లాడు. ఇంటికెళ్లాక ఛాతీలో నొప్పి రావడంతో.. అనకు అసౌకర్యంగా ఉందని చెప్పారు. అప్పుడు కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఆయన తుదిశ్వాస విడిచారు. అసద్ రౌఫ్ హఠాన్మరణంతో క్రికెట్‌లో విషాదం నెలకొంది. పాకిస్తాన్ క్రికెటర్లతో పాట అంతర్జాతీయంగా ఇతర ఆటగాళ్లు సైతం ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.

పాకిస్తాన్‌లో అలీమ్ దార తర్వాత అత్యంత విజయవంతమైన అంపైర్‌గా పేరు గడించిన అసద్ రౌఫ్.. 1998లో అంపైరింగ్ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 2000లో పాకిస్తాన్-శ్రీలంక మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. 2006లో ఐసీసీ ఇలైట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్‌లలో చేర్చబడ్డారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 170కి పైగా మ్యాచ్‌లకు అంపైరింగ్ నిర్వహించారు. ఇందులో 64 టెస్టులు (49 టెస్టులు ఆన్‌ఫీల్డ్ అంపైర్‌గా, 15 మ్యాచ్‌లు టీడీ అంపైర్‌గా), 139 వన్డేలు, 28 టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి. ఐపీఎల్ మ్యాచ్‌లకు కూడా అంపైరింగ్‌గా చేశాడు. అయితే.. 2013 ఐపీఎల్ సీజన్‌లో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం ఆయన మెడకు చుట్టుకుంది. ఆయన స్పాట్ ఫిక్సింగ్‌గా పాల్పడ్డారని, బుకీల నుంచి బహుమతుల్ని స్వీకరించారని ఆరోపణలు వచ్చాయి. అప్పుడు బీసీసీఐ వెంటనే ఆయన్ను పక్కన పెట్టి.. విచారణకు ఆదేశించింది.

ఈ ఫిక్సింగ్‌పై సుధీర్ఘ విచారణ జరిగిన అనంతరం.. 2016లో అసద్ రౌఫ్ దోషిగా తేలారు. దాంతో బీసీసీఐ ఆయనపై ఐదేళ్లపాటు నిషేధం విధించింది. నిషేధం ముగిసిన తర్వాత రీఎంట్రీ ఇచ్చేందుకు ఆస్కారం ఉన్నప్పటికీ.. అసద్ రౌఫ్ మాత్రం అందుకు ఇష్టపడలేదు. అంపైరింగ్‌కు గుడ్ బై చెప్పేసి.. లాహోర్‌లోనే ఒక బట్టల షాపు పెట్టుకున్నారు. అసద్‌ రౌఫ్ అంపైర్‌గానే కాదు.. పాకిస్థాన్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెటర్‌గా కూడా తనదైన ముద్రవేశారు. 71 ఫస్ట్ క్లాస్, 40 లిస్ట్ ఏ మ్యాచ్‌లలో మూడు సెంచరీలు, 26 అర్ధ సెంచరీల సహాయంతో 3423, 611 పరుగులు చేశారు.