Site icon NTV Telugu

PAK vs SL: భయంగా ఉంది.. పాక్ నుంచి స్వదేశానికి శ్రీలంక ప్లేయర్స్!

Sri Lanka Players

Sri Lanka Players

పాకిస్థాన్, శ్రీలంక మధ్య వన్డే సిరీస్‌ జరుగుతోంది. సిరీస్‌లో ఇప్పటికే మొదటి మ్యాచ్ (నవంబర్ 11) పూర్తయింది. రావల్పిండిలో జరిగిన మొదటి మ్యాచ్‌లో పాక్ గెలిచింది. రావల్పిండిలోనే రెండో, మూడో వన్డేలు జరగనున్నాయి. మొదటి వన్డే జరిగిన రోజే ఇస్లామాబాద్‌లో బాంబు పేలుడుతో 12 మంది మృతి చెందారు. ఇస్లామాబాద్‌కు చాలా దగ్గర్లోనే రావల్పిండి ఉండడంతో శ్రీలంక ప్లేయర్స్ భయాందోళనకు గురయ్యారు. పాకిస్థాన్‌లో భద్రతపై ఆందోళన చెందిన లంక ప్లేయర్స్ సిరీస్ ఆడలేమని స్పష్టం చేశారట.

రావల్పిండికి బాంబ్ దాడి జరిగిన ఇస్లామాబాద్‌ సమీపంలోనే ఉందని, భద్రతపై తమ క్రికెటర్లు ఆందోళన చెందుతున్నారని ఓ శ్రీలంక బోర్డు అధికారి చెప్పాడు. దాంతో పాకిస్థాన్, శ్రీలంక సిరీస్‌ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లంక జట్టులోని 8 మంది ప్లేయర్స్ నేడు స్వదేశానికి బయల్దేరనున్నారు. వన్డే సిరీస్‌ తర్వాత శ్రీలంక, పాకిస్థాన్‌, జింబాబ్వే మధ్య ముక్కోణపు సిరీస్‌ ఉంది. ఈ సిరీస్ కూడా ఇప్పుడు సందిగ్ధంలో పడింది. రెండు సిరీస్‌లు రద్దయితే పీసీబీకి భారీ నష్టం వాటిల్లనుంది. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న పీసీబీ పరిస్థితి ఇప్పుడు మరింత దిగజారనుంది.

2009లో లాహోర్‌లోని గడాఫీ స్టేడియానికి వెళ్తుండగా శ్రీలంక క్రికెటర్ల బస్సుపై ఉగ్ర వాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. అదృష్టవశాత్తు ఆ ఘటనలో ప్లేయర్స్ ప్రాణాలతో భయపడ్డారు. మహేల జయవర్దనే, చమింద వాస్, అజంత మెండిస్, కుమార్ సంగక్కర, తిలకరత్నే దిల్షాన్ సహా మరికొందరు గాయపడ్డారు. ఆ ఘటనలో భద్రత సిబ్బంది చాలా మంది మృతి చెందారు. భద్రత సిబ్బంది ప్రతిఘటించడంతో ప్లేయర్స్ సురక్షితంగా బయటపడ్డారు. ఆ దాడితో దాదాపు దశాబ్దం పాటు విదేశీ జట్లు పాకిస్థాన్‌కు క్రికెట్ ఆడేందుకు వెళ్లలేదు. 2019లో శ్రీలంక జట్టే పాకిస్థాన్‌కు వెళ్లింది. అప్పటి నుంచి అన్ని టీమ్స్ పాక్ వెళ్లి ఆడాయి. తాజా ఘటనతో మరలా అప్పటి పరిస్థితే వచ్చే అవకాశాలు లేకపోలేదు.

Exit mobile version