Site icon NTV Telugu

Women’s IPL: ఫ్రాంచైజీ రేసులో 30 కంపెనీలు..బీసీసీఐకి కాసుల వర్షం

Women's Ipl

Women's Ipl

Women’s IPL: మహిళా క్రికెటర్లు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న విమెన్స్ ఐపీఎల్‌కు అంతా సిద్ధమవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫ్రాంచైజీలను కొనుగోలు చేసేందుకు బీసీసీఐ టెండర్లు ఆహ్వానించగా మొత్తం 30 సంస్థలు టెండర్ దరఖాస్తులు కొనుగోలు చేశాయి. మహిళల ఐపీఎల్ మొదటి సీజన్లో ఐదు జట్లు పోటీ పడనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మెన్స్ ఐపీఎల్‌ జట్లను కొనుగోలు చేసిన 10 కంపెనీలతో పాటు ఇంగ్లీష్ ఫుట్‌బాల్ లీగ్‌కు చెందిన మాంచెస్టర్ యునైటెడ్, భారత స్నాక్ బ్రాండ్ హల్దీరామ్స్ కూడా పోటీలో ఉండటం గమనార్హం. ఫ్రాంచైజీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు నేటితో (జనవరి 21) ముగియనుండగా.. హల్దీరామ్స్ ఇటీవలే టెండర్ దాఖలు చేసింది. మహిళ ఐపీఎల్ ఫ్రాంచైజీల కోసం పది భారత నగరాలు, వేదికలతో బీసీసీఐ టెండర్లను ఆహ్వానించింది. సంస్థలు సింగిల్‌గా.. ఒకటి కంటే ఎక్కువ నగరాలకు బిడ్ దాఖలు చేసేలా నిబంధనలు విధించింది. ఇందుకోసం ఎలాంటి ప్రాథమిక ధరను నిర్ణయించలేదు. ఈ బిడ్లు పదేళ్ల కాలానికి అమల్లో ఉంటాయని పేర్కొంది.

పోటీలో ఎవరున్నారంటే..

పురుషుల ఐపీఎల్‌లో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన పది ఫ్రాంచైజీలు మహిళల లీగ్‌కు సంబంధించిన టెండర్ డాక్యుమెంట్లు కొనుగోలు చేశాయి. అదానీ (గల్ఫ్ జెయింట్స్), కాప్రి గ్లోబల్ (షార్జా వారియర్స్) కూడా టెండర్ వేయనున్నాయి. సిమెంట్ కంపెనీలు చెట్టినాడ్ సిమెంట్, జేకే సిమెంట్‌లూ ఫ్రాంచైజీ కొనుగోలు పట్ల ఆసక్తితో ఉన్నాయి. ఇక ఇప్పటివరకు స్పోర్ట్స్ లీగ్‌ల్లో ఆసక్తి కనబర్చని శ్రీరామ్ గ్రూప్, నీలగిరి గ్రూప్, ఏడబ్ల్యూ కట్కూరి గ్రూప్ కూడా రేసులో ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ సంయుక్త యజమానులైన తెలుగు సంస్థ జీఎంఆర్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ వేర్వేరుగా టెండర్ డాక్యుమెంట్లు తీసుకోవడం గమనార్హం. ఏపీఎల్ అపోలో, హల్దీరామ్ జట్టును కొనుగోలు చేసేందుకు ఉత్సాహంతో ఉన్నాయి.సీల్డ్ బిడ్లను జనవరి 25న ఓపెన్ చేసి బీసీసీఐ ఫ్రాంచైజీ విన్నర్లను ప్రకటించనుంది.
Mohan Raja : భాషతో సంబంధం లేదు.. భావమే ముఖ్యం

Exit mobile version