Site icon NTV Telugu

వీసా రద్దు నిర్ణయం.. ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి జకోవిచ్ ఔట్

ప్రపంచ అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు జకోవిచ్‌కు ఆస్ట్రేలియా కోర్టు షాకిచ్చింది. తన వీసాను పునరుద్ధించుకోవడానికి జకోవిచ్ ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టును ఆశ్రయించగా… అక్కడ చుక్కెదురైంది. కరోనా వ్యాక్సిన్ తీసుకోకుండా జకోవిచ్ ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టేందుకు ప్రయత్నించడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో జకోవిచ్ వీసాను ఆస్ట్రేలియా ప్రభుత్వం రద్దు చేయడం సబబేనని కోర్టు ఏకీభవించింది. జకోవిచ్‌ను ఆస్ట్రేలియా నుంచి తిప్పిపంపాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఫెడరల్ కోర్టు మద్దతు పలికింది.

Read Also: అది కోహ్లీ వ్యక్తిగత నిర్ణయం.. బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ

ఒకవేళ జకోవిచ్‌కు అనుమతి ఇస్తే వ్యాక్సిన్ వ్యతిరేకులకు అతడు ఐకాన్‌గా మారతాడని ఫెడరల్ కోర్టు వ్యాఖ్యానించింది. అతడి బాటలో మరింత మంది వ్యాక్సిన్‌లు తీసుకోకుండా స్వేచ్ఛగా తిరిగి కోవిడ్ కారకాలుగా మారతారని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో జకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనే అవకాశాలు కనుమరుగయ్యాయి. ఫెడరల్ కోర్టు తీసుకున్న నిర్ణయంతో జకోవిచ్ ఆస్ట్రేలియాను వీడాల్సి ఉంటుంది. చివరి అవకాశం కూడా విఫలం కావడంతో అతడు దుబాయ్ పయనం కానున్నాడు. కాగా జనవరి 17 నుంచి ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో టాప్‌ సీడ్‌గా జకోవిచ్ తలపడాల్సి ఉంది.

Exit mobile version