Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!

Nitish Kumar Reddy Bowling

Nitish Kumar Reddy Bowling

Nitish Kumar Reddy Trolls: న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా బౌలర్, తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మూడో టీ20లో అద్భుతంగా బౌలింగ్ (4 ఓవర్లలో 38 రన్స్) చేసిన నితీశ్.. ఈ మ్యాచ్‌లో మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా గ్లెన్ ఫిలిప్స్ దూకుడుతో అతడి బౌలింగ్‌లో పరుగుల వరద పారింది. నితీష్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 64 రన్స్ ఇచ్చి ఒక్క వికెట్ తీశాడు. దీంతో అభిమానులు సరదాగా సోషల్ మీడియాలో అతడిని ట్రోల్ చేస్తున్నారు.

నాలుగో టీ20లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినప్పటికీ న్యూజిలాండ్ బ్యాటర్లు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఫిన్ అలెన్ (31) వేగంగా పరుగులు సాధించగా.. అతడు ఔటైన తర్వాత గ్లెన్ ఫిలిప్స్ (101 నాటౌట్), మైకేల్ బ్రాస్‌వెల్ (65) భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరి విధ్వంసంతో కివీస్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలర్లను మార్చి చూసినా పరుగుల ప్రవాహాన్ని మాత్రం అడ్డుకోలేకపోయాడు.

మూడో టీ20లో అద్భుతంగా బౌలింగ్ చేసిన నితీశ్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. తన తొలి ఓవర్‌లో (7వ ఓవర్) 8 పరుగులు మాత్రమే ఇచ్చిన అతడు.. తొమ్మిదో ఓవర్‌లో 11 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే 16వ ఓవర్‌లో నితీష్ రెడ్డితో విధి ఆడింది వింతనాటకం. గ్లెన్ ఫిలిప్స్ అతడిపై విరుచుకుపడ్డాడు. వరుసగా భారీ షాట్లు ఆడుతూ సిక్సర్ల వర్షం కురిపించాడు. దీంతో ఆ ఒక్క ఓవర్‌లోనే నితీశ్ ఏకంగా 32 పరుగులు ఇచ్చుకున్నాడు. చివరి ఓవర్ వేసిన నితీష్.. ఫిలిప్స్ వికెట్ పడగొట్టి 13 రన్స్ ఇచ్చాడు.

మొత్తంగా నాలుగు ఓవర్లు వేసిన నితీశ్ రెడ్డి 64 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ తీశాడు. మూడో టీ20లో అదరగొట్టిన నితీశ్‌ రెడ్డికి నాలుగో మ్యాచ్‌లో ఇలాంటి పరిస్థితి ఎదురవడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ‘ఆహా నితీశ్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింత నాటకం’ అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. బౌలింగ్‌లో భారీగా పరుగులు ఇచ్చుకున్న నితీశ్.. బ్యాటింగ్‌లోనైనా మెరిసి జట్టుకు అండగా నిలుస్తాడా? అన్నది చూడాలి. గ్లెన్ ఫిలిప్స్, బ్రాస్‌వెల్ విధ్వంసంతో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లు ముగిసేసరికి కివీస్ 7 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది.