Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!

Niki Prasad History

Niki Prasad History

Niki Prasad Record: భారత టీ20 క్రికెట్‌లో యువ స్పిన్నర్ నిఖీ ప్రసాద్ చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో తన కెరీర్‌లో వేసిన తొలి రెండు బంతులకే రెండు వికెట్లు పడగొట్టి అరుదైన ఘనత సాధించింది. దీంతో పురుషులు, మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచింది. జింబాబ్వేతో రాయ్‌పుర్ వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20లో నిఖీ ఈ రికార్డు నెలకొల్పింది.

2025లో భారత అండర్‌-19 మహిళల జట్టుకు నాయకత్వం వహించి రెండోసారి ఐసీసీ అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌ను అందించడంలో కీలక పాత్ర పోషించిన నిఖీ ప్రసాద్.. ఇప్పుడు సీనియర్ జట్టులోనూ తన ప్రతిభను చాటుకుంది. జింబాబ్వేతో రెండో టీ20లో రెండు ఓవర్లు బౌలింగ్ చేసి ఏడు పరుగులిచ్చి రెండు వికెట్లు తీసింది. జింబాబ్వే ఇన్నింగ్స్ 15వ ఓవర్లో భారత కెప్టెన్ స్మృతి మంధాన నిఖీకి బంతిని అందించింది. అంతర్జాతీయ టీ20ల్లో తన కెరీర్‌లో వేసిన తొలి బంతికే చిపో ముగేరి-తిరిపానోను పెవిలియన్‌కు పంపింది. ఆ బంతిని వికెట్ కీపర్ రిచా ఘోష్ అందుకుంది. ఆ తర్వాతి బంతికే న్యాషా గ్వాంజురాను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేసింది. ఇలా వరుసగా తొలి రెండు బంతుల్లోనే రెండు వికెట్లు పడగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.

అంతర్జాతీయ టీ20ల్లో తమ కెరీర్‌లో తొలి బంతికే వికెట్ తీసిన మహిళా బౌలర్ల జాబితాలోనూ నిఖీ ప్రసాద్ పేరు చేరింది. ఈ జాబితాలో క్లోయ్ ట్రయాన్ (2010), అక్షతా రావు (2019), సుహానీ థడానీ (2021) ఉన్నారు. అయితే తొలి రెండు బంతులకే రెండు వికెట్లు పడగొట్టడం అరుదైన ఘనతగా నిలిచింది. ఈ రికార్డుతో నిఖీ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ కాస్ప్రోవిచ్, అమెరికా మహిళా క్రికెటర్ అక్షతా రావు సరసన నిలిచింది. కాస్ప్రోవిచ్ 2005లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో తొలి రెండు బంతుల్లో స్టీఫెన్ ఫ్లెమింగ్, మాథ్యూ సింక్లెయిర్‌లను ఔట్ చేశాడు. మహిళల టీ20 క్రికెట్‌లో అక్షతా రావు 2019లో బంగ్లాదేశ్‌పై తొలి రెండు బంతుల్లో అయేషా రెహ్మాన్, సంజిదా ఇస్లామ్‌ల వికెట్లు తీసింది.

ఇక భారత పురుషుల క్రికెట్‌లోనూ పలువురు ఆటగాళ్లు తమ టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో తొలి బంతికే వికెట్ తీశారు. అజిత్ అగార్కర్ 2006లో హెర్షెల్ గిబ్స్‌ను, ప్రజ్ఞాన్ ఓజా 2009లో షకీబ్ అల్ హసన్‌ను ఔట్ చేశారు. 2011లో విరాట్ కోహ్లీ కూడా కెవిన్ పీటర్సన్‌ను స్టంపింగ్ ద్వారా ఔట్ చేయడంలో భాగమయ్యాడు. అయితే వీరిలో ఎవరూ తమ కెరీర్‌లో తొలి రెండు బంతుల్లోనే రెండు వికెట్లు పడగొట్టలేదు. నిఖీ ప్రసాద్ అక్టోబర్ 16న రాయ్‌పుర్‌లోనే భారత జట్టు తరఫున టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. మొదటి టీ20లో ఆమెకు బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. అయితే బ్యాటింగ్లో మాత్రం 35 బంతుల్లో 39 రన్స్ చేసింది. రెండో మ్యాచ్‌లోనే అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో నిఖీ అరుదైన రికార్డు నెలకొల్పింది.