Nicholas Pooran vs Abrar Ahmed: ది హండ్రెడ్ 2026 టోర్నీని డిఫెండింగ్ ఛాంపియన్ ‘ఎంఐ లండన్’ ఘన విజయంతో ఆరంభించింది. మంగళవారం కెనింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో కావ్య మారన్‌కు చెందిన సన్‌రైజర్స్ లీడ్స్ జట్టుపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌కు ముందు ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్టును నితా అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ కొనుగోలు చేసింది. ఆ జట్టు ఇప్పుడు కొత్తగా ఎంఐ లండన్ పేరుతో బరిలోకి దిగింది. తొలి మ్యాచ్‌లోనే అద్భుత విజయంతో టైటిల్ వేటను ప్రారంభించింది.
నికోలస్ పూరన్ విధ్వంసం:
ఎంఐ లండన్ విజయంలో వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ కీలక పాత్ర పోషించాడు. 22 బంతుల్లో అజేయంగా 58 పరుగులు బాదాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 భారీ సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి. పూరన్ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ 19 బంతుల్లోనే అర్ధ శతకం బాది మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. మరోవైపు కెప్టెన్ సామ్ కరన్ 39 బంతుల్లో 60 పరుగులు బాదాడు. వీరిద్దరి చెలరేగడంతో ఎంఐ లండన్ 144 పరుగుల లక్ష్యాన్ని కేవలం 84 బంతుల్లోనే ఛేదించింది.
10 బంతుల్లో 30 పరుగులు:
పాకిస్థాన్ స్టార్ లెగ్‌స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ బౌలింగ్‌లో నికోలస్ పూరన్ విరుచుకుపడ్డాడు. అబ్రార్ వేసిన 10 బంతుల్లో 30 పరుగులు సమర్పించుకున్నాడు. పూరన్ మూడు భారీ సిక్సులతో చెలరేగాడు. పాక్ స్టార్ స్పిన్నర్ అయిన అబ్రార్ ఒక్క వికెట్ కూడా తీయలేక తీవ్రంగా నిరాశపరిచాడు. పూరన్ దూకుడు ముందు అతని బౌలింగ్ పూర్తిగా తేలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకు లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది. అబ్రార్ అహ్మద్ బెంబేలెత్తిపోయాడు, పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా పూరన్ ఆడాడుగా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
33 బంతుల్లో శతకం:
ఇటీవల ముగిసిన మేజర్ లీగ్ క్రికెట్ 2026లో ఎంఐ న్యూయార్క్ తరఫున కూడా పూరన్ అద్భుతంగా ఆడాడు. ఆ టోర్నీలో 44 బంతుల్లో 86 పరుగులు, 33 బంతుల్లో శతకం సాధించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అదే జోరును ఇప్పుడు ఎంఐ లండన్ తరఫున కూడా కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్ కోసం నితా అంబానీ అతడిని 1.75 లక్షల పౌండ్లు (సుమారు రూ.2.25 కోట్లు) చెల్లించి జట్టులోకి తీసుకుంది. మ్యాచ్ అనంతరం పూరన్ మాట్లాడుతూ.. ‘పరుగులు చేయడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కానీ నాకు జట్టు విజయమే ముఖ్యం. స్వదేశీ అభిమానుల ముందే సీజన్‌ను విజయంతో ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. తొలి కొన్ని ఓవర్లలో పిచ్ కొంత నెమ్మదిగా అనిపించింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. పరిస్థితులను అర్థం చేసుకుని ప్రణాళిక ప్రకారం ఆడటం మా విజయానికి కారణం. ఇదే ఫామ్ టోర్నీలో కొనసాగించాలని కోరుకుంటున్నాం’ అని తెలిపాడు.
కరన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన:
ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ లీడ్స్ నిర్ణీత 100 బంతుల్లో 143 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ మిచెల్ మార్ష్ 27 బంతుల్లో 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. టామ్ ఆల్సాప్ 18 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ఎంఐ లండన్ బౌలర్లలో రిచర్డ్ గ్లీసన్ నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాటింగ్‌ను కుప్పకూల్చగా.. కెప్టెన్ సామ్ కరన్ రెండు వికెట్లు పడగొట్టాడు. కరన్ తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
1st match the hundred
Nicholas pooran power up Mumbai Indians london chased down 144
Mumbai Indians london starts the tournament with win pic.twitter.com/TnadlLvQYU
— cricket millennium (@cricmillennium) July 22, 2026

