T20 World Cup: టీ20 క్రికెట్‌లో తోపుగాళ్లు ఎవరంటే ఎవరైనా వెస్టిండీస్ ఆటగాళ్ల పేర్లే చెప్తారు. పొలార్డ్, హోల్డర్, గేల్, లూయీస్, ఆండీ రసెల్, సునీల్ నరైన్, పూరన్, హిట్‌మెయిర్, బ్రావో.. ఇలా అందరూ హిట్టర్లే ఉన్న జట్టు టీ20 ప్రపంచకప్ నుంచి అర్ధంతరంగా వైదొలుగుతుందని ఎవరైనా ఊహిస్తారా. కానీ అదే నిజమైంది. రెండుసార్లు టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలిచిన ఆ జట్టుకు ఈ ప్రపంచకప్‌లో ఘోర అవమానం ఎదురైంది. గ్రూప్ దశలోనే పసికూనలను ఎదుర్కోలేక ఇంటి ముఖం పట్టింది. డూ ఆర్ డై మ్యాచ్‌లో ఐర్లాండ్ చేతిలో ఓడి మెగా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. దీంతొ ఆ జట్టుపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. జాతీయ జట్టుకు కాకుండా లీగ్‌లకే ప్రాధాన్యం ఇస్తారా అంటూ పలువురు అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
Read Also: Monkey Video: అన్నంపెట్టిన వ్యక్తి మృతి.. కన్నీళ్లు పెట్టుకొని నివాళులు అర్పించిన కోతి
కాగా బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే తమ జట్టు మెగా టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ వివరణ ఇచ్చాడు. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై 145 పరుగులు ఏ మాత్రం సరిపోవన్నాడు. తమ ప్రత్యర్థి ఐర్లాండ్ అద్భుతంగా ఆడిందని ప్రశంసలు కురిపించాడు. ఈ ఓటమి జీర్ణించుకోలేనిదని.. ఈ టోర్నీలో తమ బ్యాటింగ్ చెత్తగా సాగిందని పేర్కొన్నాడు. బ్యాటింగ్ వికెట్‌పై 145 పరుగులు చేయడం సబబు కాదని.. ఈ లక్ష్యాన్ని కాపాడటం బౌలర్ల శక్తికి మించిన పని అని తెలిపాడు. ఈ పరాజయం తమ జట్టుకు ఓ సవాల్ వంటిదన్నాడు. ఈ ఓటమి తమ జట్టుకు ఓ గుణపాఠమని చెప్పుకొచ్చాడు. అటు తమపై విజయం సాధించిన ఐర్లాండ్‌కు నికోలస్ పూరన్ అభినందనలు తెలియజేశాడు. తమ ఆటతీరుతో అభిమానులను, తమ అంతరాత్మలను తీవ్రంగా నిరాశపరిచామని.. అభిమానులు తమను క్షమించాలని కోరాడు.
