వన్డేల్లో నంబర్‌వన్ జట్టుగా కొనసాగుతున్న న్యూజిలాండ్‌కు పసికూన ఐర్లాండ్ జట్టు చెమటలు పట్టించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా డబ్లిన్‌లో శుక్రవారం జరిగిన చివరి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఆరు వికెట్ల నష్టానికి 360 పరుగులు చేసింది. ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (115 పరుగులు, 15 ఫోర్లు, 2 సిక్సర్లు), హెన్రీ నికోల్స్ (74 పరుగులు, 7 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫిన్ అలెన్ (33), కెప్టెన్ లాథమ్ (30), గ్లెన్ ఫిలిప్స్ (47) రాణించారు. న్యూజిలాండ్ భారీ స్కోరు చేయడంతో ఐర్లాండ్ ఓటమి లాంఛనమే అని అందరూ ఫిక్సయ్యారు. కానీ ఐర్లాండ్ జట్టు అసమాన పోరాటం ఈ మ్యాచ్ చూసే ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టింది. పాల్ స్టిర్లింగ్ (120 పరుగులు, 14 ఫోర్లు, 5 సిక్సర్లు), హెర్రీ టెక్టార్ (108 పరుగులు, 7 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగారు. అయితే మరొక్క బ్యాట్స్‌మెన్ వారికి సహకారం అందించి ఉంటే ఐర్లాండ్ సంచలన విజయం సాధించేది.
చివరి ఓవర్లో 10 పరుగులు కావాల్సిన దశలో న్యూజిలాండ్ బౌలర్ టిక్నర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 8 పరుగులు మాత్రమే ఇవ్వడంతో ఐర్లాండ్ ఒక్క పరుగు తేడాతో గెలుపుకు దూరమైంది. 50 ఓవర్లలో ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 359 పరుగులు మాత్రమే చేసింది. టిక్నర్ వేసిన చివరి ఓవర్‌లో వరుసగా 0, 1, 4, 1 రనౌట్, 1, 1 పరుగులు మాత్రమే వచ్చాయి. చివరి బంతికి 3పరుగులు అవసరమైన దశలో ఐర్లాండ్ బ్యాటర్ హ్యుమ్ సింగిల్ మాత్రమే తీశాడు. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. అంతకుముందు తొలి వన్డేలో కూడా చావు తప్పి కన్ను లొట్టపోయిన చందాన న్యూజిలాండ్ గెలిచింది. కాగా ఇరు జట్ల మధ్య ఈనెల 18 నుంచి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది.
