T20 World Cup: టీ20 ప్రపంచకప్ అంచనాలకు అందకుండా సాగుతోంది. ఇప్పటికే మెగా టోర్నీ నుంచి వెస్టిండీస్ లాంటి టీమ్ ఇంటి బాట పట్టింది. ఇప్పుడు సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు పరాభవం ఎదురైంది. సూపర్-12లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ 89 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 201 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను 111 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్ చేసింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ఆస్ట్రేలియా పతనానికి న్యూజిలాండ్ నాంది పలికింది. డేవిడ్ వార్నర్ 5 పరుగులకే అవుటయ్యాడు. వెంటనే కెప్టెన్ అరోన్ ఫించ్ (13), స్టాయినీస్ (7), మిచెల్ మార్ష్ (16), టిమ్ డేవిడ్ (11), మ్యాక్స్‌వెల్ (28) వరుసగా విఫలమయ్యారు. దీంతో ఏ దశలోనూ ఆస్ట్రేలియా గెలిచేలా కనిపించలేదు. చివరకు 17.1 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది.
Read Also: MS Dhoni: సేఫ్ గేమ్ ఆడిన ధోనీ.. సంబంధం లేదంటూ చేతులెత్తేశాడు
న్యూజిలాండ్ బౌలర్లందరూ చెలరేగి ఆస్ట్రేలియాను కట్టడి చేశారు. టిమ్ సౌథీ 3 వికెట్లు, మిచెల్ శాంట్నర్ 3 వికెట్లు తీసి ఆస్ట్రేలియాను కోలుకోలేని దెబ్బ తీశారు. బౌల్ట్ రెండు వికెట్లు సాధించగా ఫెర్గుసన్, ఇష్ సోథీ తలో వికెట్ తీశారు. ఈ పరాభవంతో ఆస్ట్రేలియా కోలుకుని తదుపరి మ్యాచ్‌లలో రాణించాల్సి ఉంది. ఇటీవల ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ టీమిండియా చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయింది. అప్పుడు ప్రాక్టీస్ మ్యాచ్‌లలో విజయం సాధిస్తే ప్రపంచకప్ సాధించగలమా అంటూ కెప్టెన్ అరోన్ ఫించ్ బీరాలు పలికాడు. ఇప్పుడు ఈ పరాభవానికి అతడు ఏం సమాధానం చెప్తాడని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఆస్ట్రేలియా ఉన్న గ్రూప్‌లో ఇంగ్లండ్, శ్రీలంక వంటి జట్లు ఉన్నాయి. వాటిపై విజయం సాధిస్తేనే ఆస్ట్రేలియా సెమీస్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది.
