ఈ ఏడాది ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకు కొత్త కెప్టెన్ రానున్నాడు. గత సీజన్ వరకు కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్‌ను ఇటీవల జరిగిన మెగా వేలంలో వేరే జట్టు కొనుగోలు చేయడంతో ఇప్పుడు పంజాబ్ కింగ్స్ జట్టుకు కొత్త కెప్టెన్‌ను నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్టార్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను కెప్టెన్‌గా నియమించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించనుంది.
ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగావేలంలో పంజాబ్ తిరిగి దక్కించుకున్న ఆటగాళ్లలో మయాంక్ అగర్వాల్ ఒకడు. దీంతో 2022 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టును మయాంక్ నడిపించడం ఖాయమని.. కేఎల్ రాహుల్ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించడానికి అతడే సరైన వాడు అని నిర్ణయించామని.. దీనిపై త్వరలోనే ప్రకటన వస్తుందని పంజాబ్ కింగ్స్ జట్టు వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ ఏడాది వేలంలో శిఖర్ ధావన్, బెయిర్ స్టో, లివింగ్ స్టోన్, రబాడ వంటి స్టార్ ఆటగాళ్లను పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.
