Site icon NTV Telugu

IND Vs NZ: నేడు న్యూజిలాండ్‌తో తొలి టీ20.. మరోసారి సూపర్ ఓవర్లు జరుగుతాయా?

Team India

Team India

IND Vs NZ: టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా మరో సిరీస్‌కు సిద్ధమైంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఈరోజు వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి టీ20లో తలపడనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, దినేష్ కార్తీక్ లాంటి సీనియర్లు ఈ సిరీస్‌లో ఆడటం లేదు. సీనియర్ల గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా జట్టుకు నేతృత్వం వహిస్తాడు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఈ పర్యటనకు దూరంగా ఉన్నాడు. దాంతో ఎన్‌సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ జట్టును పర్యవేక్షిస్తున్నాడు.

అయితే రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శుభ్ మన్ గిల్, సంజు శాంసన్, దీపక్ హుడా, ఇషాన్ కిషన్ లాంటి ఆటగాళ్లతో టీమిండియా మెరుగ్గా కనిపిస్తోంది. అయితే వీరిలో తుది జట్టులో ఎవరుంటారో తెలియదు. యువ ఆటగాళ్లు రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు. మరోవైపు న్యూజిలాండ్ కూడా బలంగానే కనిపిస్తోంది. కాన్వే, విలియమ్సన్, ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, ఫిన్ అలెన్‌లతో ప్రమాదకరంగానే ఉంది. గతంలో న్యూజిలాండ్ టూర్‌లో టీ20 మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా జరిగాయి. ఐదు టీ20ల సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు సూపర్ ఓవర్ల వరకు వెళ్లాయి. మరి ఈ సిరీస్ ఎలా సాగుతుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Read Also: అల్లు అర్జున్ తో సహా తప్పతాగి పోలీసులకు అడ్డంగా దొరికిన స్టార్లు..

కాగా గాయం నుంచి కోలుకున్న తర్వాత అదరగొడుతున్న పాండ్యా.. కెప్టెన్‌గా తనేంటో నిరూపించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ సారధిగా తొలి సీజన్‌లోనే కప్పు కొట్టిన పాండ్యా.. ఆ తర్వాత ఐర్లాండ్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించి మంచి మార్కులు కొట్టేశాడు. ఇప్పుడు మరోసారి న్యూజిల్యాండ్ గడ్డపై భారత జట్టుకు నాయకత్వం వహించేందుకు సిద్ధమయ్యాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే టీ20 ప్రపంచకప్‌లో కూడా జట్టుకు అతనే సారధ్యం వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Exit mobile version