Vaibhav Sooryavanshi: ఇంగ్లండ్ పర్యటన ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మళ్లీ సాధనలో నిమగ్నమయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో అతను శిక్షణ ప్రారంభించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రాక్టీస్ ప్రారంభించే ముందు హనుమంతుడి ఆశీస్సులు తీసుకున్న వైభవ్, అనంతరం నెట్స్‌లో దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు.
రాజస్థాన్ రాయల్స్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ వీడియోను ‘Back to Work’ అనే క్యాప్షన్‌తో పంచుకుంది. వీడియోలో వైభవ్‌కు జట్టు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది గౌరవ వందనం ఇవ్వడం కనిపిస్తుంది. రెండు వరుసలుగా నిలబడి అతనికి స్వాగతం పలకగా, చిరునవ్వుతో వారందరి మధ్య నుంచి నడుచుకుంటూ వచ్చిన వైభవ్ నేరుగా ప్రాక్టీస్‌కు వెళ్లాడు.
నెట్స్‌లో అతను శక్తివంతమైన షాట్లతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా అభిమానులు “హెలికాప్టర్ షాట్”గా గుర్తించే షాట్‌ను ఆడుతూ తన టైమింగ్, ఫుట్‌వర్క్, దూకుడు బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. ఇంగ్లండ్ పర్యటనలో షార్ట్ బాల్స్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో, ప్రస్తుతం అదే బలహీనతను అధిగమించేందుకు ప్రత్యేకంగా సాధన చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంగ్లండ్ పర్యటనలో వైభవ్ భారత జట్టు తరఫున టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అయితే, మూడు మ్యాచ్‌ల్లో 14, 13, 15 పరుగులకే పరిమితమయ్యాడు. మంచి ఆరంభాలు లభించినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. ముఖ్యంగా షార్ట్ బాల్స్‌ను ఎదుర్కొనే విషయంలో అతని బ్యాటింగ్‌పై విమర్శలు రావడంతో ఇప్పుడు ఆ లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నాడు.
ఇక వైభవ్ తదుపరి సవాలు జింబాబ్వే పర్యటన. జూలై 23 నుంచి ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అతను భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో ఎదురైన నిరాశను మరచి, ఈ సిరీస్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడి తన ప్రతిభను నిరూపించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ పంచుకున్న వీడియోకు అభిమానుల నుంచి భారీ స్పందన వస్తోంది. యువ బ్యాటర్‌పై ఫ్రాంచైజీకి ఉన్న నమ్మకం, అతని కష్టపడే తత్వం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి జింబాబ్వే సిరీస్‌లో వైభవ్ ఎలా రాణిస్తాడన్న దానిపైనే ఉంది.
“I don’t like cricket, I 𝘭𝘰𝘷𝘦 it” 💗 pic.twitter.com/rGHwx1ajZm
— Rajasthan Royals (@rajasthanroyals) July 15, 2026
Sooryavanshi 🚁🧨 pic.twitter.com/RD3tm9a4Z8
— Rajasthan Royals (@rajasthanroyals) July 15, 2026

