Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై భారత మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. వైభవ్‌లో ప్రపంచ క్రికెట్‌లో అతిపెద్ద స్టార్‌గా ఎదిగే సామర్థ్యం ఉందని అభిప్రాయపడ్డారు. అతని నిర్భయమైన బ్యాటింగ్, బౌలర్లపై దూకుడుగా ఆడే విధానం తనను ఎంతగానో ఆకట్టుకుందని శ్రీకాంత్ పేర్కొన్నారు. అంతేకాదు.. వైభవ్ కారణంగానే దులీప్ ట్రోఫీ వంటి దేశవాళీ టోర్నమెంట్లకు ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిందని శ్రీకాంత్ అన్నారు. ‘‘అతని వల్లే అందరూ దులీప్ ట్రోఫీని చూస్తున్నారు. నా భార్య కూడా అతని వల్లే దులీప్ ట్రోఫీ చూసింది. భవిష్యత్తులో అతను ప్రపంచ క్రికెట్‌కు గొప్ప ఆస్తిగా మారతాడు’’ అని ఆయన పేర్కొన్నారు.
దులీప్ ట్రోఫీలో అదరగొట్టిన 15 ఏళ్ల బేబీ బాస్
సెంట్రల్ జోన్‌తో జరిగిన దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో వైభవ్ కేవలం 81 బంతుల్లోనే 92 పరుగుల దూకుడు ఇన్నింగ్స్ ఆడాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 40 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో దులీప్ ట్రోఫీలో అర్ధ సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది.
రెడ్ బాల్‌లోనూ నిర్భయంగా బ్యాటింగ్
వైభవ్ బ్యాటింగ్ శైలిని శ్రీకాంత్ ప్రత్యేకంగా ప్రశంసించారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌తో పాటు రెడ్ బాల్ క్రికెట్‌లోనూ అతను బౌలర్లపై ఒత్తిడి తెస్తున్నాడని అన్నారు. మీడియం పేసర్లను నేరుగా సిక్సర్లు కొట్టే అతని ధైర్యం అసాధారణమని పేర్కొన్నారు. సరైన శిక్షణ, మార్గదర్శకత్వం లభిస్తే అతను అన్ని ఫార్మాట్లలో ప్రపంచ క్రికెట్‌ను శాసించే స్థాయికి ఎదగగలడని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు.
ఐపీఎల్‌లో 776 పరుగులు
2026 ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు సాధించాడు. ఈ ప్రదర్శన తర్వాత భారత జాతీయ జట్టులో చోటు దక్కించుకుని, దేశం తరఫున అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో ఆరంభం ఆశించిన స్థాయిలో లేకపోయినా.. జింబాబ్వేపై అద్భుతంగా పుంజుకున్నాడు. మూడు మ్యాచ్‌ల్లో 151 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నాడు.
కెరీర్‌ను తొందరపెట్టొద్దన్న బీసీసీఐ
వైభవ్ వరుస విజయాలు సాధిస్తున్నప్పటికీ అతని కెరీర్‌ను తొందరపెట్టాలని బీసీసీఐ భావించడం లేదు. అన్ని స్థాయిల్లో అతని ప్రదర్శనను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా తెలిపారు. ఒక సిరీస్ లేదా సీజన్‌లో వచ్చిన విజయానికే పరిమితం కాకుండా, వైభవ్ భారత క్రికెట్‌కు దీర్ఘకాలం సేవలందించేలా అతని కెరీర్‌ను జాగ్రత్తగా తీర్చిదిద్దడమే బోర్డు లక్ష్యమని పేర్కొన్నారు.
సరైన మార్గదర్శకత్వమే కీలకం
ఇంత చిన్న వయసులోనే వైభవ్ సాధిస్తున్న విజయాల నేపథ్యంలో అతనికి సరైన మార్గదర్శకత్వం, శిక్షణ ఎంతో అవసరమని శ్రీకాంత్ సూచించారు. యువ బ్యాటర్‌ను ప్రోత్సహించాలని, ఎప్పుడూ నిరుత్సాహపరచకూడదని అన్నారు. సరైన దిశలో నడిపిస్తే వైభవ్ భవిష్యత్తులో ప్రపంచ క్రికెట్‌లో సూపర్‌స్టార్‌గా ఎదగగలడని శ్రీకాంత్ విశ్వాసం వ్యక్తం చేశారు.

