Site icon NTV Telugu

IPL Auction: ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్‌పై ముంబై ఇండియన్స్ కన్ను

Adam Zampa

Adam Zampa

IPL Auction: ఈనెల 23న కేరళలోని కొచ్చి వేదికగా ఐపీఎల్-2023 సీజన్‌కు సంబంధించి మినీ వేలం జరగనుంది. మొత్తం 991 మంది ఆటగాళ్లు ఐపీఎల్ మినీ వేలానికి రిజిస్టర్ చేసుకోగా.. ఫ్రాంచైజీలు 405 మంది ఆటగాళ్ల పేర్లను షార్ట్‌లిస్ట్ చేశాయి. ఇందులో గరిష్టంగా 87 మంది ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. షార్ట్ లిస్ట్ చేసిన 405 మంది ఆటగాళ్లను మొత్తం 5 సెట్లుగా విభజించారు. షార్ట్ లిస్ట్ చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా కూడా ఉన్నాడు. అయితే అతడిని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత సీజన్‌లో దారుణంగా విఫలమైన ముంబై ఇండియన్స్ మినీ వేలంలో బౌలర్లపైనే ప్రధానం దృష్టి పెడుతుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also: వీటిని తింటే మీకు తెలీకుండానే నిద్రపోతారట..

ఒకవేళ ఆడమ్ జంపాను దక్కించుకోకపోతే అదిల్ రషీద్, సునీల్ నరైన్ వంటి స్పిన్నర్లను ముంబై జట్టు కొనుగోలు చేస్తుందని ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. వచ్చే సీజన్‌లో ముంబై జట్టుకు బుమ్రాతో పాటు జోఫ్రా ఆర్చర్, బెహండార్ఫ్ వంటి బౌలర్లు అందుబాటులోకి వస్తారని.. వీళ్లతో పాటు మంచి స్పిన్నర్ ఉంటే జట్టు సమతూకంగా ఉంటుందని ముంబై భావిస్తున్నట్లు సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. ఇప్పటికే జట్టులో మయాంక్ మార్కండే ఉన్నప్పటికీ.. జంపా, అదిల్ రషీద్‌ వంటి అంతర్జాతీయ స్పిన్నర్‌ను తీసుకోవడానికి ముంబై ఇండియన్స్ ప్రయత్నించవచ్చని తెలిపాడు. కాగా గరిష్టంగా 87 మంది ఆటగాళ్లకు మినీ వేలంలో అవకాశం దక్కనుండగా ఇందులో 30 స్లాట్స్ ఓవర్సీస్ ఆటగాళ్లకు దక్కనుండగా.. మరో 57 స్థానాల కోసం భారత ఆటగాళ్లు పోటీ పడనున్నారు.

Exit mobile version