MS Dhoni IPL Retirement: నా ఆలోచన తప్పు అని ఫాన్స్ నిరూపించారు.. ఎంఎస్ ధోనీ ఎమోషనల్ పోస్ట్!

Ms Dhoni First Post After Ipl Retirement

Ms Dhoni First Post After Ipl Retirement

MS Dhoni First Post After IPL Retirement: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీ తన ఐపీఎల్ కెరీర్‌కు ముగింపు పలికాడు. 2027 ఐపీఎల్ వేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను ప్రకటించే సమయంలో సీఎస్‌కే యాజమాన్యం ధోనీ పేరును విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాలో చేర్చింది. తన ఐపీఎల్ ప్రయాణానికి ముగింపు పలకాలని ధోనీ స్వయంగా ఫ్రాంచైజీకి తెలియజేసినట్లు సీఎస్‌కే యజమాని రూపా గురునాథ్ వెల్లడించారు. దీంతో దాదాపు 19 ఏళ్ల పాటు సాగిన ధోనీ ఐపీఎల్ ప్రస్థానానికి తెరపడింది. ఇకపై సీఎస్‌కేకు మెంటార్‌గా మహీ వ్యవహరించనున్నాడు.

45 ఏళ్ల ఎంఎస్ ధోనీ తన ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 278 మ్యాచ్‌లు ఆడాడు. 38.30 సగటుతో 5,439 పరుగులు సాధించాడు. ఇందులో 24 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 137.45 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన ధోనీ.. 264 సిక్సర్లు బాదాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా గుర్తింపు పొందిన మహీ.. తన ఆటతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ధోనీ ఎక్కువ కాలం చెన్నై సూపర్ కింగ్స్‌కే ప్రాతినిధ్యం వహించాడు. 2016, 2017 సీజన్లలో సీఎస్‌కేపై నిషేధం విధించడంతో.. రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ తరఫున ఆడాడు. 2018లో చెన్నై జట్టులోకి తిరిగి వచ్చిన వెంటనే తన నాయకత్వంలో ఆ జట్టుకు టైటిల్ అందించాడు. సీఎస్‌కే విజయాల్లో ధోనీ పాత్ర ఎప్పటికీ ప్రత్యేకమే.

ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఎంఎస్ ధోనీ చేసిన తొలి సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తోంది. ప్రముఖ గాయకుడు ముకేశ్ ఆలపించిన ‘పల్ దో పల్ కా షాయర్ హూన్’ పాటను తన పోస్ట్‌లో నేపథ్య సంగీతంగా ఎంచుకున్నాడు. భారత జట్టు, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన రోజులకు సంబంధించిన ఫొటోలతో ఓ ప్రత్యేక వీడియోను రూపొందించి అభిమానులతో పంచుకున్నాడు. ఈ పోస్ట్‌కు ధోనీ ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చాడు. ‘నా ఆలోచన తప్పు అని ఫ్యాన్స్ నిరూపించారు. ఈ విషయాన్ని అంగీకరించడానికి ఇంతకంటే మంచి పాట మరొకటి లేదు. బహుశా రెండు వెర్షన్లు తయారు చేసింది కూడా నేను తప్పు చేసి, ఆ తర్వాత దాన్ని అంగీకరించేందుకేనేమో’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. ఐపీఎల్‌ నుంచి వైదొలిగాక చేసిన తొలి పోస్టు కావడంతో ఇది నెట్టింట వైరల్‌గా మారింది.

2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సమయంలోనూ ఎంఎస్ ధోనీ ఇదే పాటను ఉపయోగించాడు. అప్పట్లో భారత జట్టు తరఫున తన ప్రయాణానికి సంబంధించిన ఫొటోలతో వీడియోను పంచుకుంటూ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు ఐపీఎల్‌కు కూడా అదే పాటతో వీడ్కోలు పలకడం అభిమానులకు ఆ జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేస్తోంది. ఇటీవలి సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన ఆశించినంతగా లేదు. జట్టు పునర్నిర్మాణ దశలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ధోనీ పాత్ర కూడా మారింది. 2025 ఐపీఎల్‌లో చివరిసారిగా ఆడిన మహీ.. మోకాలి గాయం కారణంగా 2026 సీజన్‌కు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ 2027 కోసం సీఎస్‌కే విడుదల చేసిన జాబితాలో ధోనీ పేరు లేకపోవడంతో ఐపీఎల్ ఆటగాడిగా అతడి ప్రయాణం ముగిసినట్లయింది. సీఎస్‌కే అధికారిక వెబ్‌సైట్‌లో అతడిని జట్టు మెంటార్‌గా పేర్కొంది.