MS Dhoni IPL 2027 Future: ఐపీఎల్ 2027 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ గడువు దగ్గరపడటంతో క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భవిష్యత్తుపై ఉత్కంఠ కొనసాగుతోంది. వచ్చే సీజన్లోనూ ఆటగాడిగా కొనసాగుతాడా? లేదా ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతాడా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు. సీఎస్కే మేనేజ్మెంట్ తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించకపోవడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ధోనీ ఆడతాడా? లేదా అనే ఏడాది ఉత్కంఠకు ఈ రోజు సాయంత్రానికి తెరపడనుంది.
నేటి సాయంత్రం 6 గంటలలోపు ఐపీఎల్‌లోని పది ఫ్రాంచైజీలు తమ రిటైన్, రిలీజ్ చేసిన ఆటగాళ్ల తుది జాబితాలను సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎంఎస్ ధోనీ భవిష్యత్తుపై సీఎస్కే నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఆటగాడిగా కొనసాగకపోయినా.. ధోనీ సీఎస్కేనే ఉంటూ మరో బాధ్యత తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ధోనీ ఐపీఎల్ 2027లో ఆడతాడా లేదా అనే విషయంపై సీఎస్కే మేనేజ్మెంట్కు ఇప్పటికే ఓ స్పష్టత వచ్చేసి ఉంటుంది. ఏదేమైనా మహీ ఆడేది లేనిది ఈరోజు తేలిపోనుంది. సీఎస్కే రిటైన్ లిస్టులో ధోనీ పేరు ఉండాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.
ఎంఎస్ ధోనీ తన నిర్ణయాలను స్వయంగా తీసుకుంటాడని, అతడి నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని సీఎస్కే మేనేజింగ్ డైరెక్టర్ కాశీ విశ్వనాథన్ గతంలో స్పష్టం చేశారు. ఆటగాడిగా అయినా, కోచ్‌గా అయినా, మెంటార్‌గా అయినా ధోనీ సీఎస్కేతో శాశ్వతంగా కొనసాగాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. అయితే అతడు ఏ బాధ్యతలో ఉండాలనుకుంటున్నాడన్నది పూర్తిగా ధోనీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు.
మరోవైపు సీఎస్కే యాజమాన్యంలోనూ, సహాయక సిబ్బందిలోనూ కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. మాజీ భారత క్రికెటర్ జహీర్ ఖాన్ జట్టుకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఈ బాధ్యతలు నిర్వహించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇంగ్లండ్ జట్టుతో చేరాడు. సీఎస్కేలో జహీర్ నియామకంలో ఎంఎస్ ధోనీ సలహా కూడా కీలక పాత్ర పోషించినట్లు కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. ఐపీఎల్ 2027లో ధోనీ మైదానంలో కనిపిస్తాడా? లేదా కొత్త పాత్రలో సీఎస్కేకు మార్గనిర్దేశం చేస్తాడా? అన్నది వేచి చూడాలి.

