NTV Telugu Site icon

MS Dhoni: ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఇక తగ్గేదే లే

Dho1

Dho1

మహేంద్రసింగ్ ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. ఐపీఎల్ 2023 కోసం మహీ రంగంలోకి దిగాడు. కొద్దిరోజులగా ప్రాక్టీస్‌లో మునిగిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కేవలం ఐపీఎల్‌లోనే ఆడుతున్న మహీ చాలా రోజుల తర్వాత బ్యాట్‌ పట్టాడు. నాలుగుసార్లు చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీని అందించిన ఈ మిస్టర్‌ కూల్‌.. ఈసారి మైదానంలో గర్జించేందుకు సిద్ధమయ్యాడు. రాంచీలోని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్‌ స్టేడియంలో నెట్స్‌లో సాధన చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు రవీంద్ర జడేజా కూడా శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకొని మళ్లీ టోర్నీలకు సిద్ధమవుతున్నాడు.

నిరుడు ఐపీఎల్‌కు ముందే ధోనీ ఈ మెగాలీగ్‌ నుంచి తప్పుకొంటాడన్న వార్తలు వచ్చాయి. కానీ వాటన్నంటికీ సమాధానం చెబుతూ గతేడాది మంచి పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఈసారి కూడా అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని భావిస్తున్నాడు. కాగా, ఆటగాడిగా ధోనీకి ఈ ఐపీఎల్ చివరిదని ప్రచారం సాగుతోంది. వచ్చే ఏడాది జరిగే లీగ్‌లో ధోనీ ఆడటం దాదాపు అసాధ్యమే. అసలు ఈ ఏడాదే అతడు తప్పుకోవాల్సింది. అయితే తన చివరి మ్యాచ్‌ను చెన్నైలో ఆడాలని ఉందని, అక్కడ ఆడిన తర్వాతనే రిటైర్‌మెంట్ తీసుకుంటానని మహీ గతంలోనే చెప్పాడు. దీంతో ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌లో అతడు తన చివరి మ్యాచ్ ఆడేస్తాడని తెలుస్తోంది. అయితే ఆ తర్వాత కూడా సీఎస్కే జట్టుతోనే ధోనీ ఉంటాడని, మెంటార్‌గానో లేక కోచ్‌గానో బాధ్యతలు నిర్వర్తిస్తాడని సమాచారం. గతేడాది దారుణంగా విఫలమైన చెన్నై.. ఈసారి ఎలాగైనా ఛాంపియన్‌గా నిలవాలని చూస్తోంది. దానికోసం ఇప్పటికే మినీ వేలంలో ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్ (రూ.16.25 కోట్లు)ను కొనుగోలు చేసింది. ఇప్పటికే ఆ జట్టులో ధోనీ, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, అంబటి రాయుడు, రుతురాజ్‌ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు.