Mohammed Shami: మరో పిడుగులాంటి వార్త.. ఇక మహమ్మద్ షమీ కెరీర్‌ క్లోజ్!

Mohammed Shami Retirement

Mohammed Shami Retirement

వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ టీమిండియాలోకి తిరిగి రావడం ఇప్పుడు మరింత కష్టంగా మారింది. 2023 వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన షమీ.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీంకు దూరమయ్యాడు. గాయాల నుంచి కోలుకుని దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనలు చేసినప్పటికీ.. బీసీసీఐ సెలెక్టర్ల నుంచి అతడికి పిలుపు రాలేదు. తాజాగా శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌లో ఎంపిక చేయలేదు. దాంతో టీమిండియా ఎంట్రీపై షమీ దాదాపుగా ఆశలు వదులుకోవాల్సిందే అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. ఇది చాలదన్నట్టు ఓ పిడుగులాంటి న్యూస్ షమీ పాలిట చేదు గుళికలా తయారైంది.

తాజాగా స్పోర్ట్‌స్టార్ కథనం ప్రకారం.. భారత సెలెక్షన్ కమిటీ ఇప్పటికే భవిష్యత్‌పై దృష్టి పెట్టింది. రాబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌తో పాటు 2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని కొత్తతరం పేసర్లను తీర్చిదిద్దే ప్రణాళికను బీసీసీఐ అమలు చేస్తోంది. ఈ క్రమంలో అన్ని ఫార్మాట్ల కోసం 15 మంది యువ ఫాస్ట్ బౌలర్లను గుర్తించినట్లు తెలుస్తోంది. ఆశ్చర్యకరంగా ఈ జాబితాలో మహమ్మద్ షమీ పేరు లేదు. దాంతో అతడి భవిష్యత్తుపై సందేహాలు నెలకొన్నాయి. సీనియర్ బౌలర్లను కొనసాగించడం కంటే యువ ఆటగాళ్లకు ఇప్పటినుంచే అంతర్జాతీయ అవకాశాలు ఇవ్వాలని సెలెక్టర్లు నిర్ణయించినట్లు నివేదిక పేర్కొంది. భవిష్యత్ ప్రధాన టోర్నీల సమయానికి ఈ యువ బౌలర్లు పూర్తి అనుభవంతో సిద్ధంగా ఉండాలన్నదే బీసీసీఐ వ్యూహంగా తెలుస్తోంది. దీంతో టీమిండియాలో తరం మార్పు ఇప్పటికే ప్రారంభమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఐపీఎల్‌ 2026లో మహమ్మద్ షమీ అద్భుత ప్రదర్శన చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచాడు. దేశవాళీల్లో పశ్చిమ్‌ బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించిన షమీ.. ఏడు మ్యాచుల్లో 37 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. యువ బౌలర్లతో పోటీపడి మరీ మంచి ప్రదర్శన చేశాడు. జస్ప్రీత్ బుమ్రాతో షమీ కలిస్తే.. భారత్ పేస్ బలం మరింత పటిష్టం అవుతుంది. కానీ 35 ఏళ్ల షమీని కాదని.. యువ పేసర్ల వైపు బీసీసీఐ సెలక్టర్లు దృష్టి సారించారు. ఇక షమీ కెరీర్‌ క్లోజ్ అయినట్లే అని చెప్పొచ్చు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప.. షమీ మళ్లీ భారత జట్టులో ఆడలేడు.