Mohammad Rizwan Says They Will Feel Pressure While Playing Match With India: భారత్, పాకిస్తాన్ జట్ల మ్యాచ్‌కి ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ ఉంటుందో అందరికీ తెలిసిందే! ఈ జట్ల మధ్య మ్యాచ్ అంటే.. అందరూ టీవీల ముందు అతుక్కుపోతారు. ఎవరు గెలుస్తారా? అనే ఉత్కంఠ వాతావరణం నెలకొంటుంది. ఈ దాయాది జట్ల మ్యాచ్‌కి అంత క్రేజ్ ఉంది కాబట్టే.. మైదానంలో దిగే ఆటగాళ్లపై ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంటుంది. తమ దేశాలు పెట్టుకున్న అంచనాల్ని ఏమాత్రం తగ్గకుండా రాణించాలన్న టెన్షన్ తీవ్రమైనది. ఇదే అభిప్రాయాన్ని తాజాగా పాకిస్తాన్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ వ్యక్తపరిచాడు. ఆసియా కప్‌లో భాగంగా ఆల్రెడీ భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఇప్పుడు ఈ ఆదివారం రెండోసారి ఈ ఇరు జట్లు తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రిజ్వాన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
‘‘భారత్‌తో మ్యాచ్ ఎప్పుడు ఆడినా, ఒత్తిడిగానే ఉంటుంది. ఒక్క ఆసియాలోనే కాదు, యావత్ ప్రపంచం ఈ మ్యాచ్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. అలాంటప్పుడు ఒత్తిడి అన్నది సహజంగా ఉంటుంది. కేవలం మా మీదే కాదు, భారత ఆటగాళ్లపై కూడా ఒత్తిడి తప్పకుండా ఉంటుంది. అయితే.. మేము చాలావరకు కామ్‌గా, ధైర్యంగా ఆడేందుకే ప్రయత్నిస్తాం. నేనైతే మా ఆటగాళ్లకు ఒకటే చెప్తా. మనం మ్యాచ్ ఆడుతోందని భారత్‌తోనా లేక హాంకాంగ్‌తోనా అనేది చూడకూడదు. ఇది బ్యాట్ అండ్ బాల్‌కి మధ్య జరిగే పోటీ మాత్రమే. ఆడే ఆట మీదే దృష్టి పెట్టాలని అంటాను. పెద్ద మ్యాచ్ ఆడుతున్నప్పుడు, ఆత్మవిశ్వాసం కూడా అదే స్థాయిలో ఉండాలి. కష్టపడటం అనేది మన చేతుల్లోనే ఉంది, ఫలితం మాత్ర దేవుడిదేనని నా నమ్మకం’’ అని రిజ్వాన్ చెప్పుకొచ్చాడు. హాంకాంగ్ మీద గెలిచినట్టుగానే, మిగతా మ్యాచుల్లో రాణించి, ఫైనల్‌కు చేరుతామని భావిస్తున్నట్టు రిజ్వాన్ తెలిపాడు.
ఇక ఇదే సమయంలో.. వరదలతో అతలాకుతలం అవుతోన్న తమ పాకిస్తాన్‌ని ఆదుకోవాల్సిందిగా ప్రపంచ దేశాల్ని రిజ్వాన్ కోరాడు. ‘‘పాకిస్తాన్ తీవ్ర భారీ వరదలతో తీవ్ర ఇబ్బంది పడుతోంది. దయచేసి పాక్ ప్రజలకు ప్రతిఒక్కరూ అండగా ఉండండి. ప్రపంచ దేశాలు పాక్ ప్రజల కోసం ప్రార్థించాలని నా కోరిక’’ అని అన్నాడు. త్వరలోనే పాక్‌లో పరిస్థితులు చక్కబడతాయని తాను ఆశిస్తున్నానని రిజ్వాన్ పేర్కొన్నాడు. కాగా.. వరదల కారణంగా ఇప్పటివరకూ 1200 మంది చనిపోయారని సమాచారం. మూడొంతుల పాకిస్తాన్ భూభాగం నీట మునిగినట్టు సమాచారం. 45 శాతం పంటలు నాశనం అయ్యాయని అక్కడి అధికారిక లెక్కలు పేర్కొంటున్నాయి.
