Misbah ul Haq Sensational Comments On Pakistan Cricketers: తమ ప్రస్తుత పాకిస్తాన్ జట్టుని ఉద్దేశిస్తూ పాకిస్తాన్ మాజీ కెప్టెన్, మాజీ కోచ్ మిస్బా ఉల్ హక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాక్ ఆటగాళ్లకు ఫిట్‌నెస్‌పై ఏమాత్రం పట్టింపు లేదన్న ఆయన.. పొట్టలు వేలాడదీసుకుంటూ తిరుగుతున్నారని తీవ్రంగా విమర్శించాడు. పొట్టలు ఉండటం వల్లే.. పరుగులు తీసేందుకు వారికి ఒళ్లు సహకరించడం లేదని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో ఓడిన నేపథ్యంలో.. మిస్బా ఈ విధంగా విరుచుకుపడ్డాడు. దేశవాళీ క్రికెట్‌లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఫిట్‌నెస్ టెస్ట్ అనేది ఒక పెద్ద జోక్‌లా తయారైందని.. అంతర్జాతీయ స్థాయి మాదిరిగానే ప్రమాణాలు నెలకొల్పాలని తాము ఎంత మొత్తుకుంటున్నా ఫలితం లేకుండా పోయిందని వాపోయాడు.
‘‘పాకిస్తాన్ క్రికెటర్లు ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నారన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. నాతో సహా షోయబ్ మాలిక్, యూనిస్ ఖాన్ వంటి ప్లేయర్స్‌కు ఫిట్‌నెస్‌పై మంచి అవగాహన, దృష్టి ఉండేది. స్వయంగా మాకు మేమే ఫిట్‌గా ఉండాలని శ్రమించేవాళ్లం గానీ, ఎవరూ మమ్మల్ని ఆ విషయంపై సహకరించింది లేదు. కానీ, ఇప్పుడు ఆటగాళ్లను చూస్తే, పొట్టలు బయటకి వచ్చేశాయి. అధిక బరువుతో కొట్టుమిట్టాడుతున్నారు. పొట్టలు రావడం వల్ల.. ఫీల్డ్‌లో పాదరసంలా కదలలేకపోతున్నారు. తగిన స్థాయిలో ఫిట్‌నెస్ ప్రమాణాలు లేకపోవడమే ఇందుకు కారణం’’ అంటూ మిస్బా ఉల్ హక్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. కాగా.. టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో భారత్‌తో పాక్ తొలి మ్యాచ్ ఆడనుంది. సాధారణంగానే భారత్, పాక్ మధ్య మ్యాచ్ అనగానే విపరీతమైన క్రేజ్ నెలకొంటుంది. ఇప్పుడు వరల్డ్‌కప్‌లో రెండు జట్లు తలపడనుండటంతో, ఈ మ్యాచ్‌పై సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది.
