Manal Chauhan Interview after IND vs PAK U19 Final: అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ ఒక్క వికెట్ తేడాతో ఉత్కంఠభరిత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 338 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన భారత్.. 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. చివరి వరకు పోరాడిన భారత జట్టు విజయానికి చేరువ కావడంలో మనాల్ చౌహాన్ కీలక పాత్ర పోషించాడు. కేవలం 32 బంతుల్లో 47 పరుగులు చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. మ్యాచ్ అనంతరం మనాల్ తన ఇన్నింగ్స్, చివరి దశలో ఎదురైన ఒత్తిడి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
తాను ఎంతో ఏకాగ్రతతో బ్యాటింగ్ చేశానని మనాల్ చౌహాన్ చెప్పాడు. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన మోహిత్ ఉల్వా తనకు ధైర్యం చెప్పాడని తెలిపాడు. ‘మనం ఈ మ్యాచ్‌ను ముగించగలం. నీ ప్రక్రియపై, నీపై నమ్మకం ఉంచు’ అని ఉల్వా చెప్పినట్లు మనాల్ గుర్తుచేసుకున్నాడు. ఫినిషర్‌గా తనపై నమ్మకం ఉంచిన కోచ్‌లు, సహాయక సిబ్బందికి మనాల్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. ‘నన్ను ఫినిషర్‌గా గుర్తించి మద్దతు ఇచ్చిన సపోర్ట్ స్టాఫ్‌కు ధన్యవాదాలు. కోచ్ నాపై ఎంతో నమ్మకం ఉంచారు. చివరి వరకు నాకు అండగా నిలిచారు. మైదానంలోకి వెళ్లిన తర్వాత నీ ఆటను నువ్వు ఆస్వాదిస్తూ సహజంగా ఆడు అని సూచించారు’ అని వెల్లడించాడు.
భారీ లక్ష్యాన్ని తక్కువ సమయంలో ఛేదించాల్సి వచ్చినప్పుడు పరుగుల లెక్కలను ఎలా వేసుకున్నాడో కూడా మనాల్ వివరించాడు. ప్రతి ఓవర్లో కనీసం ఒక బౌండరీ సాధించి, మిగతా బంతుల్లో నాలుగు సింగిల్స్ తీసుకున్నా ఓవర్‌కు 10 పరుగుల రన్‌రేట్ కొనసాగించవచ్చని భావించినట్లు చెప్పాడు. అందుకే ప్రతి ఓవర్లో కనీసం ఒక మంచి షాట్ ఆడటంపైనే దృష్టి పెట్టానని తెలిపాడు. అయితే స్పిన్నర్ బౌలింగ్‌లో ఔటైన సమయంలో తనపై తానే కొంత ఒత్తిడి పెంచుకున్నానని మనాల్ అంగీకరించాడు. ‘డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగి వెళ్లినప్పుడు నా కళ్లలో నీళ్లు వచ్చాయి. ఇలాంటి అవకాశాలు తరచూ రావు. మ్యాచ్ గెలుపునకు చాలా దగ్గరగా వచ్చిన సమయంలో ఔటవడంతో బాధపడ్డాను. చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ గెలిపించాలనుకున్నా. కానీ ఔట్ అయ్యాను’ అని భావోద్వేగానికి గురయ్యాడు.
పాకిస్థాన్ నిర్దేశించిన 338 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మనాల్ చౌహాన్ 32 బంతుల్లో 47 పరుగులు చేసి భారత విజయానికి బలమైన పునాది వేశాడు. చివర్లో మోహిత్ ఉల్వా 26 బంతుల్లో అజేయంగా 49 పరుగులు చేయడంతో.. భారత్ ఒక్క వికెట్ తేడాతో గెలుపొందింది. ఒత్తిడిలోనూ చివరి వరకు పోరాడిన యువ ఆటగాళ్ల ప్రదర్శన ఈ ఫైనల్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

