Site icon NTV Telugu

Mahendra Singh Dhoni: ధోనీ ఖాతాలో మరో ట్రోఫీ.. సోషల్ మీడియాలో వైరల్

Dhoni 1

Dhoni 1

Mahendra Singh Dhoni: టీమిండియాకు అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎవరు అని అడిగితే అందరూ చెప్పే ఏకైక పేరు ధోనీ మాత్రమే. ఎందుకంటే ధోనీ కెప్టెన్సీలోనే టీమిండియాకు వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్, టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంక్ సాధ్యమయ్యాయి. ధోనీ తర్వాత ఇప్పటివరకు ఒక్క కెప్టెన్ కూడా ఐసీసీ ట్రోఫీ సాధించలేదు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ప్రస్తుతం ఇతర క్రీడల మీదకు దృష్టి మళ్లించాడు. అతడికి కేవలం క్రికెట్ ఒక్కటే కాదు, టెన్నిస్ వంటి ఇతర క్రీడలు కూడా ఇష్టమే. టెన్నిస్‌లో కూడా ధోనీ విశేషంగా రాణిస్తుంటాడు. ఈ మేరకు జార్ఖండ్‌లో ప్రతి ఏడాది జరిగే జేఎస్‌సీఏ టెన్నిస్ టోర్నమెంట్‌లో మరోసారి సత్తా చాటాడు.

Read Also: Smoking in Marathon: వీడెవడండీ బాబూ.. సిగరెట్ తాగుతూ 42 కిలోమీటర్లు పరిగెత్తాడు

జేఎస్‌సీఏ టోర్నమెంట్‌లో పురుషుల డబుల్స్ విభాగంలో స్థానిక టెన్నిస్ ప్లేయర్ సుమిత్ కుమార్ బజాజ్‌తో జత కట్టిన ధోనీ విజేతగా నిలిచాడు. ఈ టోర్నీలో గెలవడం ఇది ధోనీకి వరుసగా మూడో సారి. ఈ నేపథ్యంలో సుమిత్ కుమార్ బజాజ్‌తో కలిసి ధోనీ ట్రోఫీ అందుకున్నాడు. ధోనీ ట్రోఫీ అందుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భారత జట్టుకు ఎన్నో ట్రోఫీలు అందజేసిన ధోనీ ఖాతాలో మరో ట్రోఫీ అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ట్రోఫీలు సాధించడంలో ధోనీకి ధోనే సాటి అని.. అందుకే అతడు ట్రోఫీ మ్యాగ్నెట్ అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ప్రస్తుతం ధోనీ ఐపీఎల్‌లో ఇంకా ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న ధోనీ ఇప్పటివరకు ఆ జట్టుకు నాలుగుసార్లు ట్రోఫీ అందించాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ తర్వాత ధోనీ రిటైర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Exit mobile version